కుల్‌భూషణ్‌ జాదవ్‌ శిక్షను రద్దు చేయాలి

తెలంగాణ 99 : భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌(48)కు పాకిస్తాన్‌ సైనిక కోర్టు మరణశిక్ష విధించడంపై నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో సోమవారం నుంచి వాదనలు కొనసాగనున్నాయి. గూఢచర్యం కేసులో మరణశిక్ష పడి పాక్‌ జైల్లో ఏళ్ల తరబడి మగ్గుతున్న  కుల్‌భూషణ్‌ జాదవ్‌ శిక్షను రద్దుచేసి.. తక్షణం విడుదల చేయాలని అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌ గట్టిగా వాదించింది. ‘‘కేవలం అభాండాలే తప్ప పాక్‌ దగ్గర ఆయన నేరాన్ని నిరూపించే ఒక్క ఆధారమూ లేదు. ఆయన ఉగ్రవాది అనడానికి, గూఢచారి అనడానికి ఒక్క సాక్ష్యమూ లేదు. అసలు మిలటరీ కోర్టు శిక్ష విధించడమేంటి? అక్కడి జడ్జీలంతా సైన్యాధికారులే. వారికి లీగల్‌ వ్యవహారలపై శిక్షణ, న్యాయశాస్త్ర పట్టా లేవు.

కుల్‌భూషణ్‌ విచారణలో కనీస ప్రమాణాలు పాటించడంలో పాక్‌ విఫలమయ్యింది’’ అని భారత్‌ తరఫున సీనియర్‌ లాయర్‌ హరీశ్‌ సాల్వే వాదించారు. ‘‘ఒక విదేశీయుణ్ని బంధించినపుడు ఆయనపై నిష్పక్షపాతమైన, సమర్థత ఉన్న న్యాయస్థానం విచారణ జరపాలి. ఆ వ్యక్తికి జీవించే హక్కు ఉంటుంది. పాక్‌ మిలటరీ కోర్టులో అలా జరగలేదు. రెండేళ్లలో 161 మంది పౌరులకు ఉరిశిక్ష విధించింది. మా దేశస్థుడినీ అదే గాటన కట్టింది. కుల్‌భూషణ్‌ విచారణలో అంతర్జాతీయ న్యాయ, విచారణ విధానాలను పక్కనపడేశారు’’ అని సాల్వే పేర్కొన్నారు. ‘‘ఆయనను భయపెట్టి, బెదిరించి, లొంగదీసుకుని.. గూఢచర్యానికి పాల్పడ్డట్లు వాంగ్మూలమిప్పించారు. ఇది చెల్లదు’’ అని సాల్వే అన్నారు. 2017 ఏప్రిల్‌లో కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాక్‌ సైనిక కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసి- అంతర్జాతీయ న్యాయస్థానంలో అప్పీలు చేసింది. తమ తీర్పు వచ్చేదాకా శిక్ష అమలు చేయవద్దని పాక్‌ను ఐసీజే ఆదేశించింది.
వాదనల ప్రారంభానికి ముందు పాక్‌కు భారత్‌ ఓ ఝలక్‌ ఇచ్చింది. ఈ విచారణకు భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి దీపక్‌ మిట్టల్‌ కూడా హాజరయ్యారు. అక్కడే ఉన్న పాకిస్థాన్‌ అటార్నీ జనరల్‌ అన్వర్‌ మన్సూర్‌ ఖాన్‌ లేచి- దీపక్‌ వద్దకు వచ్చి కరచాలనానికి చెయ్యి చాచారు. కానీ దీపక్‌ దాన్ని పట్టించుకోకుండా కేవలం ఓ నమస్కారం పెట్టి ముందుకు వెళ్లిపోయారు. అసలు ఆయనను పట్టించుకోనే లేదు. తనను విస్మరించడంతో మన్సూర్‌ వెంటనే తన సీటు దగ్గరకు వెళ్లిపోయి కూర్చుండిపోయారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *