ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడిపారనే చిన్న నేరానికి 4 రోజుల జైలు శిక్ష – హైకోర్టులో పిటిషన్‌

సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడిపారనే చిన్న నేరానికి 4 రోజుల జైలు శిక్ష విధించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. చిన్న నేరానికి జరిమానా వేసి హెచ్చరించకుండా అంత పెద్ద శిక్ష విధించడం సరికాదంది. యువకుడిగా ఉంటూ జైలు శిక్ష అనుభవిస్తే భవిష్యత్తులో అతనితోపాటు వారి కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో శిక్ష విధించే ముందు పరిశీలించాలని కింది కోర్టులకు సూచించింది. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడుపుతున్నందున ఎం.వి.భరద్వాజ అనే యువకుడికి 4 రోజుల జైలు శిక్ష విధిస్తూ సైబరాబాద్‌ నాలుగో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. రూ.500 జరిమానా సంబంధిత కోర్టులో చెల్లించాలంటూ భరద్వాజకు ఆదేశాలు జారీ చేసింది. జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ భరద్వాజ మేనమామ హైకోర్టులో అత్యవసరంగా మంగళవారం ఉదయం కోర్టు అనుమతి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. భరద్వాజ నిబంధనలను ఉల్లంఘించిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఎలాంటి ప్రమాదం జరగలేదన్న విషయాన్ని అయినా పరిగణనలోకి తీసుకుని కింది కోర్టు జరిమానా విధించి ఉండాల్సిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జైలుకెళ్లి వచ్చిన వారిని సమాజం ఎలా చూస్తుందో ఊహించి ఉండాల్సిందని, కుటుంబ స్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, న్యాయాధికారులు దోషులుగా ఒక్క రోజు జైలులో ఉండి వస్తే ఆ బాధ ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించింది. అధికారం ఉందని ఇలా దుర్వినియోగానికి పాల్పడరాదని, ఓ నిర్ణయం వెలువరించే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ తాము చెబుతూనే ఉన్నా పట్టించుకోవడం లేదంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *