ఘటన జరిగిన తర్వాత స్పందిస్తారా – హై కోర్టు ఫైర్

హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో అగ్నిప్రమాదాల నివారణ, విపత్తులను ఎదుర్కొనే విషయంలో అధికారులు తగిన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో అధికారుల సమాధానం ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని తేల్చిచెప్పింది. ఎగ్జిబిషన్‌ సందర్భంగా అక్కడికి వచ్చే సందర్శకుల భద్రతకు ఏం చర్యలు తీసుకుంటున్నారు.. అగ్నిప్రమాదాల నివారణకు ఏం చేయబోతున్నారు.. విపత్తుల నిర్వహణ కింద ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.. తదితర వివరాలను తమ ముందుంచాలని డీజీపీ, విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖ డీజీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్లను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకోకుండానే ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రాసిక్యూట్‌ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం జస్టిస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. అందుబాటులో ఉన్న వివరాలతో ఈ మొత్తం వ్యవహారంపై అఫిడవిట్‌ దాఖలు చేశామంటూ ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్‌.శరత్‌కుమార్‌ దాన్ని ధర్మాసనం ముందుంచారు.
విస్తృత జన సమూహాలు వచ్చే ఎగ్జిబిషన్‌ వంటి నిర్వహణకు ఎన్‌ఓసీ అవసరమా?లేదా? అని ప్రశ్నించింది. అవసరమని శరత్‌ చెప్పగా.. మరి అఫిడవిట్‌లో ఎన్‌ఓసీ అవసరం లేదని అధికారులు ఎలా చెబుతారని నిలదీసింది. చట్టం కావాలని చెబుతున్న దాన్ని అవసరం లేదని అధికారులు ఎలా చెబుతారంది. ‘ఎగ్జిబిషన్‌కు వచ్చే జనాల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు? అనుకోని దుర్ఘటన ఏదైనా జరిగితే ఎగ్జిబిషన్‌ లోపలి నుంచి బయటకు వెళ్లేందుకు ఎన్ని మార్గాలున్నాయి.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి.. వాటి ద్వారా ఎలా బయటపడాలి.. తదితర ప్రాథమిక సమాచారాన్ని ఎగ్జిబిషన్‌కు వచ్చే జనాలకు వివరించే ప్రయత్నం చేశారా? ఎక్కడైనా బయటకు వెళ్లే మార్గాల గురించి బోర్డులపై రాశారా? విమానం బయల్దేరిన వెంటనే ఎయిర్‌హోస్టెస్‌ ప్రతీసారి విమానంలో ఉండే ద్వారాల సమాచారాన్ని ప్రయాణికులకు చెబుతారు. ఎందుకు? అనుకోని ఘటన ఏదై నా జరిగితే వాటి ద్వారా బయటపడటం ప్ర యాణికులకు సులభమవుతుందని. ఎగ్జిబిషన్‌ విషయంలో ఇలా చేయొచ్చు. కానీ మీరు (అధికారులు) అలా చేయట్లేదంటే మీ విధులు, బాధ్యతలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నట్లే.’అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిప్రమాద నివారణ ఏర్పాట్లను మరిం త మెరుగుపరిచామని శరత్‌ చెప్పారు. వెంటనే ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘మనదేశంలో ఇదే సమస్య. దురదృష్టకర సంఘటన జరిగిన తర్వాతే మేల్కొంటారు. ప్రపంచమంతా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే.. మనం మాత్రం ఘటన జరిగాకనే స్పందిస్తాం. ఇలా జరిగాక స్పందిస్తే.. బతుకు దెరువు కోసం ఎగ్జిబిషన్‌లో దుకాణాలు ఏర్పాటు చేసిన వారి పరిస్థితేంటి? ఘటన వల్ల వారికి జరిగే నష్టాన్ని ఎవరు పూడ్చాలి?’అంటూ ప్రశ్నించింది. కోర్టు హాలులో ఉన్న అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారిని అడిగి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ విస్తీర్ణం, అందులో ఏర్పాటు చేసిన ఫైర్‌ ఇంజను,్ల ఇతరయంత్రాలు, బయటకెళ్లే గేట్లు, వాటి వెడల్పుఎగ్జిబిషన్‌కు ఎంత మంది సందర్శకులొస్తారు.. తదితర వివరాలను అడిగి తెలుసుకుంది. 24 ఎకరాల్లో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ ఉందని, ప్రస్తుతం 4 ఫైర్‌ ఇంజన్లు ఏర్పాటు చేశామని, బయటకెళ్లేందుకు 3 గేట్లు ఉన్నాయని, ఒక్కో గేటు మార్గం 18 అడుగులు ఉంటుందని, సాధారణ రోజుల్లో 30 వేలు, సెలవులు, వారాంతాల్లో 80 వేల వరకు జనం వస్తారని అధికారి వివంచారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *