తన గాజులను అమ్మి జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచారు

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కార్పొరేటు సంస్థలు, పలువురు ప్రముఖులు భారీ ఎత్తున సాయం ప్రకటించారు. అలాగే సామాన్య ప్రజలు సైతం మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఓ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్‌ కిరణ్‌ ఝాగ్వల్‌ తన గాజులను అమ్మి జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచారు. గాజులు అమ్మగా వచ్చిన రూ.1.38లక్షలు ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా పంపారు. దాడి ఘటనతో తీవ్రంగా కలత చెందిన తను ఇంటి ఆధారాన్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తన తోటి మహిళలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే ఈ పని చేసినట్లు తెలిపారు. ‘‘ భర్తను కొల్పోయి విలపిస్తున్న వారిని చూసి నేను ఏం చేయగలనని ఆలోచించాను. నాకున్న గాజుల వల్ల ప్రస్తుతానికి పెద్దగా ఉపయోగం లేదనిపించింది. వెంటనే వాటిని అమ్మి ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చాను’’ అని కిరణ్‌ ఝాగ్వల్‌ తెలిపారు. ఇతరులు కూడా సాయం చేయాలని ఆమె అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ పోలీసుస్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ పట్టణమంతా తిరిగి సొంతంగా విరాళాలు సేకరిస్తున్నారు. రాజస్థాన్‌లోని ఓ యాచకురాలు కూడబెట్టిన దాదాపు రూ.6లక్షలను ఆమె మరణాంతరం నామినీలు జవాన్ల కుటుంబాలకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఎవరికి వారు తమకు తోచిన సాయం చేస్తూ.. జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *