బుల్లెట్ రైళ్లు కాదు.. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు కొనండి – అఖిలేశ్‌ యాదవ్‌

దేశంలో బుల్లెట్‌ రైళ్ల కంటే ముందు సైనికులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు అవసరమని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ అభిప్రాయపడ్డారు. పుల్వామా దాడికి కారణమైన ఇంటెలిజెన్స్‌ లోపాలను వివరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘‘ పాక్‌కు గుణపాఠం చెప్పడానికి రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వంతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. 40మంది జవాన్ల మృతికి ఇంటెలిజెన్స్‌ లోపమే కారణమని అర్థమవుతోంది. అలా జరగడానికి కారణమేంటి? ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను కలుపుకొనిపోవడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైంది’’ అని అఖిలేశ్‌ ప్రశ్నించారు. యావత్తు దేశం ఎన్నికలను ఎదుర్కోవడంతో పాటు సరిహద్దులను రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలన్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో అమరులకు సంతాపంగా రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేస్తే.. భాజపా మాత్రం ఎందుకు కొనసాగించిందని ఆయన ప్రశ్నించారు. ప్రచారాలు ఆపి దేశ రక్షణపై దృష్టి సారించాలని భాజపాకు సూచించారు. అంతకుముందు ట్విట్టర్‌ వేదికగా.. ‘‘ప్రతి రోజు సైనికులు అమరులయ్యారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ పర్వం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది. ఎన్ని రోజులు సంతాప దినాలు పాటించాల్సి వస్తుందో..? ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది’’ అని అఖిలేష్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *