సీరియల్ కిల్లర్ పోలీసులకు చిక్కాడు

మహబూబ్‌నగర్‌: 17 మందిని చంపిన సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి కథనం ప్రకారం.. ఇటీవల మిడ్జిల్, భూత్పూరు, దేవరకద్ర, కొత్తకోట పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస హత్యలు కలకలం రేపాయి. ఈ నెల 17న నవాబుపేట మండలం కూచూరుకు చెందిన అలివేలమ్మ (53) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెది హత్యగా నిర్ధారించుకున్న పోలీసులు.. జిల్లాలోని బాలానగర్ మండలం గుంపేడుకు చెందిన పాత నేరస్తుడు ఎరుకల శ్రీను పాత్ర ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా, అతివేలమ్మను తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. అంతేకాదు, అతడికి సంబంధించి మరిన్ని విస్తుపోయే విషయాలను పోలీసులు వెల్లడించారు. అతడిపై మొత్తంగా 18 కేసులు నమోదై ఉండగా, అందులో 17 హత్య కేసులని తెలిపారు. మహిళలను హత్య చేసి వారి ఒంటిపై ఉన్న నగలను, డబ్బును దోచుకునేవాడని పోలీసులు తెలిపారు. 2007లో సొంత తమ్ముడిని కూడా అత్యంత కిరాతకంగా చంపేశాడని వివరించారు. ఈ నెల 16న మహబూబ్‌నగర్‌లో ఓ కల్లు దుకాణానికి వెళ్లిన నిందితుడు.. అక్కడ అలివేలమ్మతో మాటలు కలిపాడు. దేవరకద్ర పాత్రంలో తనకు ఒకరు రూ.20 వేలు ఇవ్వాల్సి ఉందని, వాటిని కనుక ఇప్పిస్తే రూ.4 వేలు ఇస్తానని ఆమకు ఆశ చూపాడు.నమ్మిన అలివేలు అతడితో ద్విచక్ర వాహనంపై వెళ్లింది. మార్గమధ్యంలో ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత మత్తులో ఉన్న అలివేలును హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు, కాలి పట్టీలు తీసుకుని పరారయ్యాడు. కేసు విచారణలో భాగంగా శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా అతడి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని పోలీసులు తెలిపారు. జైళ్ల శాఖ ఆద్వర్యంలో నడుస్తున్న పెట్రోలు బంకులో ఉపాధి కల్పించినా అతడు మారలేదని పేర్కొన్నారు. కాగా, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి ఒకటిన్నర తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *