మార్కెట్లోకి కొత్త వెయ్యి నోటు !

పెద్దనోట్ల రద్దుతో ఎదురైన చిక్కులకు పరిష్కారం చూపేందుకు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త వ్యూహం రచిస్తోంది. మార్కెట్లోకి కొత్త వెయ్యినోట్లు తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్ల రూపంలో ఉన్న రూ.14.5 లక్షల కోట్లలో ఇప్పటికే రూ.8లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. ఈ అంతరాన్ని తగ్గించేందుకు రోజూ రూ.25 వేల కోట్లను బ్యాంకుల ద్వారా ఆర్బీఐ మార్కెట్లోకి విడుదల చేస్తోందని కేంద్ర సహాయమంత్రి అర్జున్‌ మేఘ్‌వాల్‌ అన్నారు. ఈ లెక్కన సాధారణ స్థితి ఏర్పడేందుకు దాదాపు 45 రోజులు పట్టే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.

మరోవైపు మార్కెట్లోకి కొత్త నోట్ల రూపంలో రూ.3.35లక్షల కోట్లు మాత్రమే ప్రవేశించాయని మేఘ్‌వాల్‌ అన్నారు. అయితే సమస్యను మరింత త్వరగా తీర్చేందుకు సమీప భవిష్యత్తులోనే రూ.1000 నోట్లను తెచ్చేందుకు ఆర్‌బీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రూ.2000 నోట్లకు చిల్లర సంపాదించడం ప్రజలకు ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయంవైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు ఒక్కసారిగా పెరగడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఈ ఖాతాల సంఖ్య 16.47 లక్షలు పెరగడం విశేషం. జన్‌ధన్‌ ఖాతాల్లో నల్లధనంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. మరోవైపు ప్రజలను ఖాతాలు తెరిచేందుకూ ప్రోత్సహిస్తోంది.

మరోవైపు ఈ ఉదయం కొన్ని పార్టీలు భారత్ బంద్ కు, మరికొన్ని పార్టీలు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆ ప్రభావం చాలా స్వల్పంగా కనిపిస్తోంది. ఈ ఉదయం 10 గంటలకు బ్యాంకులు తెరచుకున్నప్పటికీ, ఏ బ్యాంకులోనూ నగదు లేకపోవడంతో విత్ డ్రా కోసం వచ్చిన కస్టమర్లను లోపలికి అనుమతించడం లేదు. దీంతో బంద్ నుంచి మినహాయింపు ఉన్నా, తమకు బ్యాంకుల వల్ల వీసమెత్తు ఉపయోగం లేకపోయిందని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా, ఈ మధ్యాహ్నం తరువాత బ్యాంకులకు నగదు చేరే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *