విద్యాసంస్థల్లో 20వేల పోస్టుల భర్తీ

రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టుల్లో కొత్త ఉద్యోగులను నియమించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. విద్యాసంస్థల్లోని అన్ని నియామకాలకు సంబంధించిన ప్రక్రియను వారంరోజుల్లో ప్రారంభించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు ఏర్పడే ఖాళీలను గుర్తించి, వాటి భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవడానికి నిరంతరం సమీక్షలు నిర్వహించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఎప్పటికప్పుడు సంప్రదించి, అధికారుల సమన్వయంతో ఖాళీలను గుర్తించాలని, పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో 1,428 పోస్టులు

రాష్ట్రంలో కొత్తగా 84 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ప్రారంభమవుతున్నాయి. వీటిలో 1,428 మంది సిబ్బంది అవసరం. 840 మంది బోధన, 588 మంది బోధనేతర సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియను వెంటనే ముగించాలని సీఎం ఆదేశించారు.

అర్బన్ రెసిడెన్షియల్స్‌లో 377 ఉద్యోగాలు

కొత్తగా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 377 ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం అనుమతించిందని సీఎం చెప్పారు. వీటిలో 174 మంది బోధన, 203 మంది బోధనేతర సిబ్బందిని వెంటనే నియమించాలని ఆదేశించారు.

రెసిడెన్షియల్ స్కూళ్లలో 7,300 టీచర్లు

ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లలో 7,300 మంది టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామని, ఈ నెల 31న పరీక్ష నిర్వహిస్తున్నామని ఘంటా చక్రపాణి చెప్పారు. పరీక్ష ముగిసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నియామకాలు జరుపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

పాఠశాలల్లో 8,792 టీచర్ పోస్టులు

రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో 8,792 టీచర్ పోస్టుల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దీనికి సంబంధించి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించారు.

కాలేజీలు, ప్రభుత్వశాఖల్లో 2,437 పోస్టుల భర్తీకి జూన్ 2న నోటిఫికేషన్

రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇతర ప్రభుత్వశాఖల్లో 2,437 పోస్టులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు. వీటిలో లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు, సివిల్ ఇంజినీర్లు, వెటర్నరీ అసిస్టెంట్లలాంటి పోస్టులున్నాయి. వీటి నియామకాలు త్వరలోనే పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *