సీఎం దత్తత గ్రామాల్లో రేపు గృహప్రవేశాలు …

సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల దశ తిరిగింది. గత ఏడాది ఇదే తేదీన యావత్‌ ప్రపంచాన్ని ఆక ట్టుకున్న అయుత చండీయాగానికి డిసెంబర్ 23న సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఎర్రవల్లిలో ఆరు రోజుల పాటు యాగాన్ని వైభవంగా నిర్వహించారు. సరిగ్గా ఈ ఏడాదికి అదే తేదీన మరో ఘట్టానికి ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు వేదికలుగా మారనున్నాయి.600 మంది బ్రాహ్మణుల వేదమంత్రోచ్చారణలతో పల్లెలు మార్మోగనున్నాయి.

మొన్నటిదాకా పాత పెంకులతో.. మట్టిగోడలతో.. ఇరుకుగా ఉన్న నివాసాలు.. ఇప్పుడు పక్కా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లుగా మారాయి! పదీ ఇరవై కాదు.. ఏకంగా ఆరు వందల ఇండ్లు! అన్నీ ఒక్క తీరులో.. ఎల్‌ఈడీ కాంతులు వెదజల్లే వీధులతో.. వైఫై కనెక్టివిటీతో ఆధునికతను చాటుతూనే.. ఇంటింటికీ ఒక గేదె, నాటు కోళ్లు.. ఇంటి ఆవరణలో ఫల పుష్పాల మొక్కలతో తన పల్లె వాతావరణం ఛాయలు కోల్పోని ఒక అద్భుతం.. ఆవిష్కారానికి సిద్ధమైంది.

erravalli
erravalli

23న ఉదయం 7.13 గంటల నుంచి 8.30 గంటల నడుమ ఏకకాలంలో 580 ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఎర్రవల్లిలో 380 ఇళ్లలో ఇప్పటికే 340 ఇళ్లు పూర్తికాగా, నర్సన్నపేటలో 200 ఇళ్లకుగాను 150 పూర్తయ్యాయి. మిగతా ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కాగా మొత్తం ఇళ్లకు ఇదే రోజున గృహ ప్రవేశాలను చేపట్టేందుకు బ్రహ్మ ముహూర్తాన్ని ఖరారు చేశారు.

రూ.5.04 లక్షల వ్యయంతో ఒక్కో డబుల్‌ బెడ్‌రూం ఇంటిని నిర్మించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లలో విద్యుత్ సౌకర్యంతో పాటు నల్లా కనెక్షన్లు.. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి గోదావరి జలాలను అందిస్తుంది. రిలయన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వైఫై కనెక్షన్లు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్‌ ఇంటితో పాటు 10 కోళ్లను, రెండు పశువులను కూడా అదే రోజు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు.

రేపు ఉదయం జరిగే గృహప్రవేశానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎం కేసీఆర్‌కు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అందజేశారు. ఈ ఆహ్వాన పత్రికలో ప్రత్యేకమైన బాక్సులో బాదం పలుకులు, పసుపు, కుంకుమ భరిణే పెట్టి ఈ ఆహ్వాన పత్రికను తయారు చేశారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ గతంలో పర్యటించినప్పటి ఫొటోలను, అయుత చండీయాగంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్న ఫొటోను ఆహ్వాన పత్రిక మధ్యలో పొందుపరిచారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *