సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం: నటుడు పోసాని

తెలంగాణ ప్రజలకు, సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నట్లు ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తెలిపారు. ఏపీలో ఆధార్, ఓటర్ కార్డు లేని వారు నంది అవార్డులపై మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించడంపై పోసాని మండిపడ్డారు. నంది అవార్డుల విషయంలో లోకేష్, బాబు ప్రకటన విన్నాక తెలంగాణ ప్రజలు ఎంత గొప్పవాళ్లో అర్థమవుతున్నదన్నారు. నంది విషయంలో విమర్శించినంత మాత్రాన మేం నాన్ రెసిడెంట్ ఆంధ్రానా..? అని పోసాని ప్రశ్నించారు. తెలంగాణలో బతికి తెలంగాణ గడ్డను రాజకీయం చేసింది ఆంధ్రా నాయకులు కాదా..? పోసాని ప్రశ్నించారు.

దోచుకునే వాళ్లతోనే మా కొట్లాటగానీ..ఇక్కడ బతికేవాళ్లతో కాదని కేసీఆర్ ఆనాడే చెప్పారని పోసాని గుర్తు చేశారు. ఆంధ్రా ప్రజలు మాకు బిడ్డల్లాంటి వాళ్లని కేసీఆర్ అన్నారు. ఏనాడు కూడా ఆంధ్రావాళ్లను తరమండి. కొట్టండి అనలేదన్నారు. ఒక వేళ కేసీఆర్ ఆంధ్రావాళ్లను వెళ్లగొట్టండి అంటే మమ్మల్ని పిచ్చి కుక్కల్లా కొట్టి ఖమ్మం సరిహద్దు దాటించేవారని పేర్కొన్నారు. లోకేశ్ లాంటి మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే ఇక్కడ ఆంధ్రావాళ్లు చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయేవాళ్లన్నారు. ఇవాళ తాము తెలుగు రోహింగ్యాలమయ్యామని చెప్పారు.

ట్యాక్స్ ఇక్కడ కడితే అక్కడ పనికిరారా..విమర్శించకూడదా..? అని పోసాని మంత్రి లోకేశ్ ను ప్రశ్నించారు. లోకేశ్..చదువుకున్నావా..బుద్ది, జ్ఞానం సంస్కారంతో మాట్లాడుతున్నావా..మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టడం లేదా..? ప్రభుత్వం వచ్చాక కూడా ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారు కదా.? మరి మీరు అక్కడ రాజకీయం ఎలా చేస్తారని పోసాని ప్రశ్నించారు. నీ లాంటి నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండి ఉంటే నాశనం అయ్యే వాళ్లమని పోసాని ఎద్దేవా చేశారు. లోకేశ్ నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా ? గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా..? అపుడు చంద్రబాబును ఎవరైనా నాన్‌లోకల్ అన్నారా ? నంది అవార్డులను విమర్శిస్తే నాన్ లోకల్ అంటారా..? అని పోసాని ప్రశ్నించారు.

విమర్శించే వాళ్లు నాన్ లోకల్ అయితే జ్యూరీలో ఉన్న సభ్యుల మాట ఏంటి..వాళ్లకు కూడా హైదరాబాద్‌లోనే ఆధార్ కార్డులున్నాయి కదా, వారు కూడా ఇక్కడే ట్యాక్స్‌లు కడుతున్నారు కదా.. మరి వారిని జ్యూరీలోకి ఎలా తీసుకున్నారని పోసాని ప్రశ్నించారు. తనకు టెంపర్ సినిమాకు వచ్చిన ఉత్తమ సహాయ నటుడు అవార్డును తిరస్కరిస్తున్నట్లు పోసాని చెప్పారు. ఈ అవార్డు అందుకోవడానికి తాను సిగ్గుపడుతున్నానని పోపాని అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *