బంధువులకు శశికళ గట్టి వార్నింగ్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత ఆప్తురాలు శశికళ తన వ్యూహారచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీపై పట్టు సంపాదించుకునేందుకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను నామమాత్రంగా చేసేందుకు శశికళ అడుగులు వేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా శశికళ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇప్పటికే తనతో పాటు తన సన్నిహితుల వల్ల మల్లర్ గుడి మాఫియాగా పేరు వచ్చేసిన నేపథ్యంలో ఇకనుంచి పార్టీలో ప్రభుత్వంలో తన సన్నిహిత బంధువులు ఎవరికీ స్థానం లేదని శశికళ తేల్చిచెప్పారు. గతంలో ఒక సారి తన బంధువుల వల్లే జయలలిత దూరం పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

తమిళనాడు రాజకీయాలు కీలక మలుపులు తిరిగే పరిస్థితి కనిపిస్తున్న క్రమంలో శశికళ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం తన బంధువులకు మాత్రమే కాకుండా ఇటు అన్నాడీఎంకే మంత్రులు ముఖ్య నేతలకు సైతం ఇదే విషయం చెప్పినట్లు సమాచారం. తమ బంధువుల్లో ఎవరైనా అనవసర జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని శశికళ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇలా చేయడం ద్వారా తను షాడో సీఎంను అనే భావనను కలగనీయకుండా శశికళ జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. ఇదిలాఉండగా ప్రస్తుతం జయ నివాసమైన పోయెస్ గార్డెన్స్ లోనే ఉంటున్న శశిశకళ త్వరలో అక్కడే పూర్తి స్థాయి మకాం ఏర్పాటు చేస్తారని అంటున్నారు. త్వరలో తన వెంట ఉన్న బంధువులను పంపించి పోయెస్ గార్డెన్లోనే ఉండేందుకు శశికళ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

మరోవైపు జయ మరణంతో రంగంలోకి దిగిన శశికళ భర్త నటరాజన్ రెండు రోజుల క్రితం ఓ ఆంగ్ల చానెల్తో మాట్లాడుతూ.. ఎవరైనా.. ఓ సామాన్య వ్యక్తి అయినా పార్టీని ముందుకు తీసుకెళ్లడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అనడం ఆసక్తి కలిగిస్తున్నది. జయలలిత మరణానంతరం తొలిసారిగా సీఎం పన్వీర్సెల్వం నేతృత్వంలో ఆ రాష్ట్ర కేబినెట్ సమావేశం శనివారం జరుగనుంది. కాగా తమిళనాడు ఇంచార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్తో భేటీ అయ్యారు. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిస్థితి శాంతిభద్రతలపై వారు చర్చించినట్లు తెలిసింది. జయ మృతి నేపథ్యంలో ఈ నెల 12న తన జన్మదిన వేడుకలు జరుపొద్దని అభిమానులకు రజనీకాంత్ సూచించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *