అశోక్ గజపతిరాజుకు ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ షాక్

కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఓ ఎయిర్ ఇండియా పైలట్ షాక్ ఇచ్చారు. సోమవారం ఎయిర్ ఇండియా పనితీరుపై అధికారులతో సమావేశమైన అశోక్ గజపతిరాజు.. మిగిలిన విమానయాన సంస్ధలతో పోలిస్తే ఎయిర్ ఇండియా కమిట్ మెంట్ లో లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సుభాషిష్ మజుందార్ అనే ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ మంత్రికి లేఖ రాశారు.

రాజకీయ నాయకుల్లో లోపిస్తున్న ప్రేరణ, నిబద్దతలపై ప్రశ్నించారు. ఓ బాధ్యత గల ఉద్యోగిగా, నిజాయితీగా పన్ను చెల్లించే వ్యక్తిగా, దేశ పౌరుడిగా ఈ ఏడాది శీతాకాల లోక్ సభ, రాజ్యసభల్లో విలువైన కాలాన్ని రాజకీయ నాయకులు వృథా చేయడంపై మండిపడ్డారు. కేవలం ఒక్క లోక్ సభలోనే 92గంటల సమయం వృథాగా పోయిందని.. సభ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాజకీయ నాయకులు నినాదాలు, పోస్టర్ల ప్రదర్శనలు చేశారని అన్నారు. రాజకీయ నాయకులను చూసిన ఎయిర్ ఇండియా ఉద్యోగులు అందరూ ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చితే నిబద్దతలో మన నాయకులు వెనుకబడ్డారని భావించారని చెప్పారు.

రాజకీయ నాయకులను చూడటం వల్లే ఎయిర్ ఇండియా ఉద్యోగుల్లో నిబద్దత కొరవడి ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు తాము ఏం చేస్తున్నారో.. ఓ సారి ఆత్మవిమర్శ చేసుకోవాలని.. అప్పుడే మిమ్మల్ని చూసి ఎయిర్ ఇండియా ఉద్యోగులు మారతారని చెప్పారు. నిజాయితీగా పని చేసే ఉద్యోగులను ఉద్దేశించి రాజకీయ నాయకులు మాట్లాడటం సబబు కాదని పేరు తెలపడానికి ఇష్టపడని మరో ఎయిర్ ఇండియా పైలట్ అన్నారు. మజుందార్ వ్యాఖ్యలతో ఎయిర్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదని అవి ఆయన సొంత వ్యాఖ్యలని ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *