ఎయిరిండియాలో కొత్త నియామకాలు, పదోన్నతుల నిలిపివేత

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ఉద్యోగుల పదోన్నతులు, కొత్త నియామకాలు నిలిపివేసింది. సుమారు రూ.55వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వీలైనంత త్వరంగా మోడీ  సర్కార్‌ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలు, ప్రమోషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం సూచించింది.

ఎయిరిండియాను రానున్న నాలుగైదు నెలల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇందుకు కేంద్రమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఓ కమిటీ కూడా ఏర్పాటైంది. వాటా విక్రయ ప్రక్రియ కోసం.. ఎయిరిండియా ఖాతాలను ఈనెల 15న ముగించామని, ఈ వివరాలనే వీటిని బిడ్‌ల ప్రక్రియ కోసం వినియోగించనున్నట్లు వెల్లడించారు.  దీపావళి లోపు అమ్మే ప్రయత్నాలు చేస్తామని  డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్‌మెంట్  సెక్రటరీ అటన్ చక్రవర్తి  ఇటీవల వెల్లడించారు. ఏ షరతులపై ప్రైవేటు కంపెనీల నుంచి బిడ్స్ ఆహ్వానించాలనే విషయాన్ని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ సిద్ధం చేస్తోంది.

2018 లో ఎయిరిండియాలో 76 శాతం వాటా విక్రయించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమైన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఎయిరిండియా ద్వారా రోజుకు రూ.15 కోట్ల ఆదాయం వస్తోంది,  దాదాపు 10,000 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి బకాయిలను పెండింగ్‌లో ఉంచొద్దని అన్ని విభాగాల అధిపతులను ఎయిరిండియా ఆదేశించినట్లు సంబంధిత వర్గాల సమాచారం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *