మెట్రో స్టేషన్: అమీర్‌పేట్ ఇంటర్‌చేంజ్ దేశంలోనే అతిపెద్ద స్టేషన్‌గా రికార్డు

అమీర్‌పేట్ ఇంటర్‌చేంజ్ స్టేషన్ హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్‌కే హైలెట్‌గా నిలుస్తున్నది. కారిడార్-1(మియాపూర్-ఎల్బీనగర్), కారిడార్-3 (నాగోల్-శిల్పారామం)లను కలుపుతూ మైత్రివనం వద్ద నిర్మించిన ఈ స్టేషన్ దేశంలోనే అతిపెద్ద మెట్రోస్టేషన్‌గా రికార్డు సాధించింది. ఇంజినీరింగ్ అద్భుతంగా పిలుస్తున్న ఈ స్టేషన్‌ను పర్యావరణ హితంగా గ్రీన్‌బిల్డింగ్ థీమ్‌తో నిర్మించారు. మిగతా స్టేషన్ల మాదిరిగానే ఇంటర్‌చేంజ్ పక్షి ఆకారాన్ని పోలి, వింగ్స్ ఆధారంగా బ్యాలెన్స్ క్యాంటిలివర్ పద్ధతినే వినియోగించారు. బ్యాంకాక్ మెట్రో ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకొని ఇంటర్‌చేంజ్‌ను నిర్మించారు. బ్యాంకాక్‌లో మూడు పిల్లర్లపై స్టేషన్‌ను నిర్మించగా, మన దగ్గర ఒకే పిల్లర్‌పై సాధ్యంచేసి చూపించారు. రోడ్డుమధ్యలోని 1.5 మీటర్ వ్యాసార్థం గల పిల్లర్ నుంచి ఇరువైపులా 6 మీటర్ల మేర స్టేషన్ విస్తరించి ఉంటుంది.

స్టేషన్ ప్రత్యేకతలు

-పొడవు:142 మీటర్లు.. వెడల్పు: 40 మీటర్లు
-స్టేషన్ నిర్మాణానికి 25 వేల క్యుబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించారు. 2వేల మంది కార్మికులు పాలుపంచుకున్నారు.
-8 లిఫ్ట్‌లు, 16 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. వీటిద్వారా ఒకేసారి 6 వేల మంది ప్రయాణించవచ్చు.
-విద్యుత్ సరఫరా కోసం 33 కేవీ లైన్లను ఏర్పాటు చేశారు. 400 కేవీఏ డీజిల్ జనరేటర్‌ను అందుబాటులో ఉంచారు.
-స్టేషన్‌లో అంతర్గత కనెక్షన్ల కోసం 20 కి.మీ.ల పొడవైన విద్యుత్‌లైన్లను వేశారు.
-40 వేల మంది సులభంగా రాకపోకలు సాగించవచ్చు.
-కాన్‌కోర్స్‌లెవల్‌కు టికెట్‌లేకుండా ప్రవేశింవచ్చు. పాదచారులు రోడ్డు దాటడానికి వినియోగించుకోవచ్చు.
-మూడోఅంతస్తు (కారిడార్-1)ప్లాట్‌ఫాం వరకు ఎత్తు: 30 మీటర్లు, పైకప్పు వరకు 36 మీటర్లు.
-పైకప్పును టెట్రాహైడ్రాన్ స్టీల్‌తో పటిష్ఠంగా తయారుచేశారు.
-స్టేషన్‌లో రిటైల్ ఔట్‌లెట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు, కన్వీయన్స్ ఔట్‌లెట్స్ ఉంటాయి.
-స్టేషన్ అవసరాలు, అగ్ని ప్రమాదాల నివారణకు లక్ష లీటర్ల సామర్థ్యంతో నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు.
-అడ్వాన్స్‌డ్ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టం, ఉప్పల్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భవన నిర్వహణను పర్యవేక్షిస్తారు.
-అగ్నిప్రమాదాల నివారణకు అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగితే క్షణకాలంలోనే వాయువులు విడుదలై మంటలను ఆర్పుతాయి.

ఈ స్టేషన్‌లో మొత్తం మూడు అంతస్తులు ఉన్నాయి. మొదటి అంతస్తును కాన్స్‌కోర్ లెవల్ అని పిలుస్తారు. ఇక్కడ ఆఫీస్, టికెట్ కౌంటర్, ఏటీఎం తదితర సౌకర్యాలు ఉంటాయి. రెండో అంతస్తులో కారిడార్-3 నుంచి వచ్చే రైళ్లు, మూడో అంతస్తులో కారిడార్-1 నుంచి వచ్చే రైళ్లు ఆగుతాయి. మియాపూర్ నుంచి నాగోల్ వైపు వెళ్లాల్సిన వారు అమీర్‌పేట్‌కు వచ్చాక మూడోఅంతస్తులో దిగి కింది అంతస్తుకు వచ్చి నాగోల్ వైపు వెళ్లే రైలు ఎక్కాల్సి ఉంటుంది. నాగోల్ నుంచి మియాపూర్ వైపు వెళ్లాల్సినవారు అమీర్‌పేట్‌లో రెండో అంతస్తులో దిగి మూడో అంతస్తుకు చేరుకోవాల్సి ఉంటుంది. నాగోల్ నుంచి మియాపూర్ వరకు ఒకే టికెట్ ఉన్నా కచ్చితంగా రెండు రైళ్లు మారాల్సిందే. ప్రయాణికులు సులభంగా అంతస్తులు మారేందుకు లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఎలివేటర్లు ఏర్పాటు చేశారు. అన్ని స్టేషన్లలో రైళ్లు 20 సెకండ్లు మాత్రమే ఆగే అవకాశం ఉండగా, అమీర్‌పేట్‌లో మాత్రం రెండు నిమిషాల పాటు నిలుపుతారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *