సిరియాపై 59 మిస్సైళ్ల‌తో అమెరికా దాడి

సిరియాలో ఇవాళ అమెరికా క్షిప‌ణి దాడులు చేసింది. ర‌సాయ‌నిక దాడి ఘ‌ట‌న‌కు ప్రతీకారంగా ప్ర‌భుత్వ బ‌ల‌గాల‌ ప్రాంతాల‌ను టార్గెట్ చేసింది. ఓ సిరియ‌న్ ఎయిర్‌బేస్‌పై 59 తోమాహాక్ మిస్సైల్స్‌తో అమెరికా ద‌ళాలు దాడి చేసిన‌ట్లు పెంట‌గాన్ అధికారి ఒక‌రు తెలిపారు. మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రంలో ఉన్న నేవీ డెస్ట్రాయ‌ర్స్ నుంచి ఆ మిస్సైళ్ల‌ను ఫైర్ చేశారు. సిరియా అంతర్యుద్ధంపై ఏదో ఒక‌టి చేయాల‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని గంట‌ల్లోనే క్షిప‌ణి దాడులు జ‌రిగాయి. మంగ‌ళ‌వారం జ‌రిగిన ర‌సాయనిక దాడిలో సుమారు వంద మంది వ‌ర‌కు మృతిచెంద‌న విష‌యం తెలిసిందే.

సిరియా భ‌విష్య‌త్తులో ఇక ఆ దేశాధ్య‌క్షుడు అస‌ద్ పాత్ర ఉండ‌కూడ‌ద‌ని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్ల‌ర్ స‌న్ గురువారమే ఓ ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ర‌సాయ‌నిక దాడి జ‌రిగిన త‌ర్వాత అమెరికా ఒక్క‌సారిగా సిరియా పైన ఉన్న త‌న విధానాన్ని మార్చేసుకున్న‌ది. ఈ కార‌ణం వ‌ల్ల‌నే తాజాగా క్షిప‌ణ దాడులు జ‌రిగిన‌ట్లు తెలుస్తున్న‌ది.

మ‌రోవైపు సిరియా ప్ర‌భుత్వం, ర‌ష్యా ద‌ళాలు మాత్రం ర‌సాయ‌నిక దాడి తాము చేయ‌లేద‌ని చెబుతున్నాయి. ఐక్య‌రాజ్య‌స‌మితి ఆంక్ష‌లు ఉన్నా అస‌ద్ ప్ర‌భుత్వం నిర్ధాక్షిణ్యంగా ర‌సాయ‌నిక వాయువుల‌ను వాడింద‌ని ట్రంప్ అన్నారు.

సిరియాలోని హోమ్స్ ప‌ట్ట‌ణంలో ఉన్న ష‌య‌ర‌త్ ఎయిర్‌బేస్‌పై అమెరికా క్షిప‌ణులతో దాడి చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఆ ఎయిర్‌బేస్‌లో ఉన్న విమానాలు, మౌళిక‌స‌దుపాయాలు, ర‌న్‌వేను అమెరికా క్షిప‌ణులు ధ్వంసం చేశాయి. సిరియాపై దాడుల‌కు ముందు అమెరికా త‌న చిర‌కాల శ‌త్రువు ర‌ష్యాకు కూడా వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తున్న‌ది. సిరియాలో ర‌క్త‌దాహానికి అంతం ప‌లికేందుకు అన్ని నాగ‌రిక దేశాలు అమెరికాతో క‌లిసి రావాల‌ని పిలుపునిచ్చారు. జాతీయ భ‌ద్ర‌తా అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సిరియాపై దాడులు చేసిన‌ట్లు ట్రంప్ అన్నారు. త‌మ ఎయిర్‌బేస్‌పై జ‌రిపిన దాడిని సిరియా ఖండించింది. అమెరికా ఆవేశ‌పూరితంగా ప్ర‌వ‌ర్తించింద‌ని సిరియా ఆరోపించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *