ఆడియో క్లిప్ కు సారీ చెప్పిన ఆనంద్ మహీంద్రా

సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని ఉదంతాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. వీటిల్లో కొన్నింటిలో న్యాయమైన అంశాలు కనిపిస్తున్నాయి.మరీ ఇంత దారుణమా? అన్న సందేహం కలిగేలా అనిపించే ఆడియో క్లిప్ కొన్ని వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో అలా అనిపించిన ఆడియో క్లిప్ గా టెక్ మహీంద్రా హెచ్ ఆర్ విభాగానికి చెందినదిగా చెప్పాలి.

24 గంటల కంటే తక్కువ సమయంలో టెక్ మహీంద్రా గ్రూప్ నకు చెందిన ఒక ఐటీ ఉద్యోగిని తన ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ హెచ్ ఆర్ విభాగానికి చెందిన ఒక మహిళా ఉద్యోగిని ఫోన్ లో హెచ్చరించటం.. ఒకవేళ సదరు ఉద్యోగి తనకు తానుగా రిజైన్ చేయకుంటే.. తామే అతన్ని విధుల నుంచి తొలగిస్తామని చెప్పటం కనిపిస్తుంది.

కనీస సమయం ఇవ్వకుండా కేవలం గంటల వ్యవధిలో ఉద్యోగం నుంచి తీసేయాలన్న కార్పొరేట్ నిర్ణయాన్ని నిర్దయగా వినిపించిన హెచ్ ఆర్ ఉద్యోగిని మాటలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

చాలామందికి ఇలాంటివి ఎదురైనా.. ఒక తెలివైన ఉద్యోగి ఒకరు కాల్ రికార్డు చేయటంతో ఈ ముచ్చట లోకానికి తెలిసింది. ఈ ఆడియోక్లిప్ కలకలం చివరకు టెక్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా వరకూ వెళ్లటమే కాదు.. తమ మానవవనరుల విభాగం అనుసరించిన వైఖరికి ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పారు.

వ్యక్తిగత గౌరవాన్ని కాపాడటం కంపెనీ ప్రధాన నైతిక బాధ్యత అని.. అయితే అలా జరగనందుకు తాను క్షమాపణ చెబుతున్నట్లుగా వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని తాను హామీ ఇస్తున్నట్లుగా ప్రకటించారు.

ఛైర్మన్ లాంటోడే సారీ చెప్పిన తర్వాత కంపెనీకి సంబందించిన మిగిలిన ప్రముఖులు కామ్ గా ఉంటారా? ఒకరి తర్వాత ఒకరుగా సారీల వర్షం కురిపించారు. టెక్ మహీంద్రా వైస్ ఛైర్మన్ వినీత్ నయ్యర్ సైతం ఆడియో క్లిప్ ను ప్రస్తావిస్తూ.. ఆ ఉదంతం తమ దృష్టికి వచ్చిందని.. ఆ తరహాలో చర్చ జరగటాన్ని తాము తీవ్రంగా చింతిస్తున్నామని.. భవిష్యత్తులో అలా జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తానికి జరిగిన తప్పునకు చెంపలేసుకోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామం ఐటీ ఉద్యోగులకు ఎంతోకొంత సాంత్వన కలిగిస్తుందనటంలో సందేహం లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *