రివ్యూ: అంధగాడు..మెప్పిస్తాడు

కథ:
గౌతమ్‌(రాజ్‌తరుణ్‌) శారదాదేవి అనే అంధ ఆశ్రమంలో తన స్నేహితులు రాజు, కిరణ్‌, దివ్యలతో కలిసి పెరుగుతుంటాడు. తన కళ్ళ కోసం కంటి ఆసుపత్రులు చుట్టూ తిరుగే గౌతమ్‌కు ఓ సందర్భంలో అసిస్టెంట్‌ కమీషనర్‌ ధర్మ(షాయాజీ షిండే) కూతురు నేత్ర(హెబ్బా పటేల్‌) పరిచయం అవుతుంది. తను గుడ్డివాడినని తెలిస్తే నేత్ర తనను విడిచి పెట్టేస్తుందని భావించిన గౌతమ్‌, తన స్నేహితుడు(స్యత) సహాయంతో నేత్ర దగ్గర కళ్ళు ఉన్నవాడిలా నటిస్తుంటాడు. అయితే ఓ సందర్భంలో నేత్రకు నిజం తెలిసిపోతుంది. తనకు అబద్ధం చెప్పినందుకు గౌతమ్‌ను విడిచి పెట్టి వెళ్ళిపోతుంది. అయితే నేత్ర కంటి వైద్యురాలు కావడంతో ఓ యాక్సిడెంట్‌ కేసులో వచ్చిన కళ్ళను గౌతమ్‌కు పెట్టేలా ఏర్పాటు చేస్తుంది. కంటిచూపు వచ్చిన గౌతమ్‌, నేత్రను చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. తనే నేత్ర అని చెప్పకుండా మూగ అమ్మాయిలా నటిస్తుంది నేత్ర. అయితే గౌతమ్‌కు కూడా నేత్ర నటిస్తుందనే అసలు నిజం తెలుస్తుంది. కానీ నేత్ర వల్లే తనకు కళ్ళు వచ్చాయని, నేత్ర కూడా తనను ప్రేమిస్తుందని తెలుసుకున్న గౌతమ్‌ ఆమెను ప్రేమిస్తాడు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. గౌతమ్‌కు ఓ కారు నెంబర్‌ పదే పదే కలలో కనపడుతూ ఉంటుంది. అదే సమయంలో కులకర్ణి(రాజేంద్రప్రసాద్‌) కారణంగా పేరు మోసిన రౌడీ బాబ్జీ(రాజా రవీందర్‌) మనుషులను చంపి మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు. అసలు కులకర్ణి ఎవరు? కులకర్ణి బాజ్జీ మనుషులను ఎందుకు చంపాలనుకుంటాడు? అసలు గౌతమ్‌కు, బాజ్జీకి ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్‌ పాయింట్స్‌:
– నటీనటులు
– ఛాయాగ్రహణం
– బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌
– ఫస్టాఫ్‌
మైనస్‌ పాయింట్స్‌:
– సెకండాఫ్‌ ఫస్టాఫ్‌ కంటే ఎఫెక్టివ్‌గా అనిపించదు
– సెకండాఫ్‌ సాగదీతగా అనిపిస్తుంది
విశ్లేషణ:
రాజ్‌తరుణ్‌ ఇప్పటి వరకు సాఫ్ట్‌ లవర్‌బోయ్‌లా కనిపించాడు. ఈ సినిమాలో కాస్తా యాక్షన్‌ డోస్‌ పెంచాడు. అలాగని సిక్స్‌ ప్యాక్‌లు గట్రాలేవీ చేయలేదనుకోండి. తన పరిధిలో యాక్షన్‌ రేంజ్‌ పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఇక సినిమాలో ఫస్టాఫ్‌లో నలబై నిమిషాలు గుడ్డివాడి పాత్రలో నటించిన రాజ్‌తరుణ్‌, ఆ పాత్రలో చక్కగా నటించాడు. హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ను మెయిన్‌ టెయిన్‌ చేస్తూ చక్కగా నటించాడు. ఫస్టాఫ్‌లో నార్మల్‌గా కనిపించే రాజ్‌తరుణ్‌ ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో కాస్తా యాక్షన్‌ హీరోలా కనపడే ప్రయత్నం చేశాడు. హెబ్బా పటేల్‌ తన పాత్రకు న్యాయం చేసింది. రాజ్‌తరుణ్‌, హెబ్బా జంట మరోసారి స్క్రీన్‌పై ఆకట్టుకుంది. ఇక మెయిన్‌విలన్‌గా చేసిన రాజా రవీందర్‌, సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో పాత్రలో ఒదిగిపోయాడు. కులకర్ణి పాత్రలో రాజేంద్ర ప్రసాద్‌ నటన గురించి మనం కొత్తగా చెప్పనక్కర్లేదు. నటకిరిటీ చాలా సులువుగా తన పాత్రను చేసేశాడు. ఇక సత్య, ఫిష్‌ వెంకట్‌, జయప్రకాష్‌ రెడ్డి, సుదర్శన్‌ అందరూ తమ వంతుగా కామెడిని పండించే ప్రయత్నం చేశారు.వీరి కామెడి ఓకే.
సుదర్శన్‌ను రాజ్‌తరుణ్‌ ఇబ్బంది పెట్టే రెండు సీన్స్‌ బావున్నాయి. ఇక రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకుడిగా చేసిన తొలి ప్రయత్నం బావుంది. కథలో చాలా ట్విస్టులను కన్‌ఫ్యూజన్‌ లేకుండా తెరపై చూంచాడు. ఫస్టాప్‌ను ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించాడు. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవడం, ట్విస్టులు ప్రారంభం కావడం, రివీల్‌ కావడం ఇలా కాస్తా సాగదీతగా అనిపిస్తుంది. ఇక శేఖర్‌ చంద్ర ట్యూన్స్‌లో రెండు పాటలు బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అయితే సెకండాఫ్‌ చూస్తుంటే పక్కా కమర్షియల్‌ మూవీలా అనిపిస్తుంది. ఎం.ఆర్‌.వర్మ సెకండాఫ్‌లో తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బావున్నాయి.
రేటింగ్‌: 2.75/5
నిర్మాణ సంస్థ: ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: రాజ్‌తరుణ్‌, హెబ్బా పటేల్‌, రాజేంద్రప్రసాద్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, సత్య, రాజా రవీంద్ర, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు
సంగీతం: శేఖర్‌ చంద్ర
ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్‌
కళ: కృష్ణమాయ
కూర్పు: ఎం.ఆర్‌.వర్మ
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్‌
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *