బడ్జెట్ రోజు తెలుగు రాష్ట్రాల మహా పంచాయితీ..!

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి రెండున్నరేళ్లకు పైనే అయ్యింది. నేటికి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంచాయితీలెన్నో. పలు అంశాలు ఇప్పటికి తేలక.. అలానే అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఇలా ఉండిపోయిన విషయాల్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు రెండు రాష్ట్రాల సీఎంలు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని.. లెక్కతేల్చుకోవాల్సిన ఉన్నా..  అది ఇప్పటివరకూ జరగలేదు.

ఈ మధ్యన రిపబ్లిక్ డే సందర్భంగా రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఏకాంత సమావేశం జరగటం.. ఈ సందర్భంగా హైకోర్టు విభజన విషయంలో తమకు సహకరించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కోరటం.. ఈ సందర్భంగా ఒకట్రెండు విషయాలుగా కాకుండా.. రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న అన్ని పెండింగ్ ఇష్యూలను ఒకే టేబుల్ మీద చర్చించి..పూర్తి చేసేస్తే బాగుంటుందన్న ఆలోచనను చంద్రబాబును చెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీ పెట్టుకోవాలని.. దీనికి గవర్నర్ మధ్యవర్తిగా వ్యవహరించాలన్న ఆలోచనకు ఇద్దరు చంద్రుళ్లు వచ్చారు.

నాటి నిర్ణయం తర్వాత వరుసగా జరిగిన చర్చల ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల మంత్రుల స్థాయి కమిటీలు రేపు (బుధవారం) హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో జరగనున్నాయి. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మంత్రుల స్థాయి కమిటీల మధ్య చర్చలు ఇదే తొలిసారిగా చెప్పాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉన్న సమస్యల్ని తెర మీదకు తీసుకురావటం.. ఆయా రాష్ట్రాల వాదనను వినటం.. వాటికి పరిష్కార మార్గాల్ని వెతకటం.. ఉభయులకు అంగీకారయోగ్యమైన పరిష్కారాన్ని ఓకే చేయటం ఈ మహా పంచాయితీ లక్ష్యంగా చెప్పొచ్చు.

సచివాలయం.. ప్రభుత్వ భవనాలు.. 9.. 10 షెడ్యూల్ సంస్థల విభజన.. జల జగడాలు.. విద్యుత్ ఉద్యోగుల విభజనతో సహా ప్రధాన సమస్యలన్ని ఎజెండా కానున్నాయి. కేంద్ర హోం శాఖ పరిష్కరించాల్సిన తొమ్మిది.. పదో షెడ్యూల్ అంశాల్ని కూడా తామే పరిష్కరించుకోవాలన్న ఆలోచనలో రెండు తెలుగు రాష్ట్రాలు రావటం గమనార్హం.

ఈ మహా పంచాయితీలో తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుందన్నది ఏమిటి? ఏపీ సర్కారు కోరుకుంటున్నదేమిటన్న విషయాన్ని చూస్తే.. ఇరువురి కోర్కెలు ఒక కొలిక్కి వచ్చేఅవకాశం ఉందా? అన్నది ఇప్పుడుప్రశ్రగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఏపీ సర్కారు నిర్ణీత గడువుకు ముందే హైదరాబాద్ వదిలేసి అమరావతి వెళ్లిపోయిన క్రమంలో.. వాటికి కేటాయించిన భవనాలు భారీగా ఉన్నాయి. ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. వీటిని తమకు అప్పగించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఖాళీగా ఉన్న భవనాల్ని ఏపీ సర్కారు అద్దెకు ఇచ్చే వీలు ఉండటం.. అదే సమయంలో తెలంగాణ సర్కారుకు భవనాల కొరత ఉన్న నేపథ్యంలో ఏపీ సర్కారుకు కేటాయించాల్సిన భవనాల్ని తమకు ఇచ్చేయాల్సిందిగా తెలంగాణ సర్కారు కోరుతోంది.

అయితే.. ఈ విషయంలో ఏపీ వాదన ఆసక్తికరంగా ఉంది. విభజన తర్వాత తమ వాటా కింద వచ్చే ఆస్తుల జాబితా.. వాటి విలువలపై ఏపీ సర్కారు ప్రాథమిక అంచనాల్ని తయారు చేసినట్లుగా చెబుతున్నారు. ఇలా తయారుచేసిన అంచనాల ప్రకారం.. హైదరాబాద్ లో ఏపీ ఆస్తుల కింద ఉండే భవనాల విలువ రూ.50వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తానికి సరిపడా విలువైన భూముల్ని తమకు అప్పజెప్పాలన్నది ఏపీ సర్కారు ఆలోచనగా చెబుతున్నారు. మరి.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ సమస్యతో పాటు.. చాలానే ఇష్యూలు రెండు రాష్ట్రాల మధ్యఉన్నాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి తప్పించి.. ఇగోలకు పోయే పక్షంలో రెండురాష్ట్రాల మధ్య పంచాయితీ కొలిక్కి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదనే మాటను చెబుతున్నారు. భవనాల అప్పగింత.. హైకోర్టు విభజన.. ఆస్తుల పంచాయితీ తేలాలంటే  రెండు రాష్ట్రాలు పట్టువిడుపులు ఉండాల్సిందే. మరీ విషయంలో ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మధ్య చర్చలు ఏ దిశగా జరుగుతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు. రెండు తెలుగు సర్కార్ల మధ్య జరిగే మహా పంచాయితీకి మధ్యవర్తిగా వ్యవహరించనున్న గవర్నర్ సమర్థతకు ఇదో పరీక్షగా పలువురు అభివర్ణిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *