అన్నాచెల్లెళ్ళ అనుబంధం వెనుక.?

చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ ఒకే వేదికపై కన్పించడంలో వింతేముంది.? బాలకృష్ణ – చంద్రబాబు కన్పించినా అది వింతేమీ కాదు. కేసీఆర్‌ – కేటీఆర్‌ ఒకే వేదికపై కన్పించినా అంతే. కేసీఆర్‌ – కేటీఆర్‌ – హరీష్‌రావు విషయంలోనూ పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అంశమేమీ కన్పించదు. కానీ, కేటీఆర్‌ – కవిత ఒకే వేదికపై కన్పించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

తన నియోజకవర్గంలో జరిగిన ఓ బహిరంగ సభలో అన్నయ్య కేటీఆర్‌ పాల్గొనడంతో చెల్లెమ్మ కవిత ఉబ్బితబ్బిబ్బయిపోయారు. అమ్మలోని ‘అ’, నాన్నలోని ‘న్న’ కలిస్తే ‘అన్న’ అంటూ సినిమాటిక్‌ డైలాగ్‌ చెప్పేశారు కవిత. రాజకీయంగా, వ్యక్తిగతంగా అన్నయ్య తనకు అండదండగా వుంటూ వస్తున్నాడనీ, ఓ అన్నయ్య ఓ చెల్లెమ్మకు ఎంత ఎక్కువ చెయ్యాలో అంతగా తనకు అన్నీ చేస్తూనే వున్నాడనీ కవిత చెప్పుకొచ్చేశారు. మరోపక్క, చెల్లెలి ఘనత గురించి అన్నయ్య కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు.

వున్నపళంగా ఈ అన్నా, చెల్లెళ్ళ ‘కలయిక’ ఏంటట.? అన్నదిప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ. నిజమే మరి, చాలా సాధారణమైన విషయాన్ని ‘అత్యంత ప్రత్యేకమైన అంశం’గా మార్చడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే వుండాలి. నిజానికి కవిత, టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ పొందడానికి పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. రాజకీయంగా తనకంటూ ఓ గుర్తింపు కోసం ‘జాగృతి’ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టారామె. అయినాసరే, అన్నయ్య నుంచి ‘రెడ్‌’ సిగ్నల్‌ రావడంతో పార్టీలో చోటు కోసం పడరాని పాట్లూ పడాల్సి వచ్చిందట కవితకి. అది గతంలోని మాట. ఎలాగైతేనేం, తండ్రిని మెప్పించి పార్టీలో సీటు దక్కించుకున్నారు.. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు కూడా.

మరోపక్క, పార్టీలో కేటీఆర్‌కీ హరీష్‌రావుకీ పొసగడం లేదన్న వాదనలు ఈనాటివి కావు. ఈ మధ్యకాలంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్ట్‌కి కేటీఆర్‌ పేరుని ఖరారు చేయాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్నా చెల్లెళ్ళ కలయిక చోటు చేసుకుందన్నది తాజాగా విన్పిస్తోన్న గాసిప్స్‌ సారాంశం. హరీష్‌రావు మాత్రం, ఎప్పుడూ చెప్పే మాటే చెబుతున్నారు.. పార్టీలో ఎలాంటి విభేదాల్లేవనీ, కేసీఆర్‌తో ఎప్పటికీ విభేదాలు రావనీ, పార్టీ అధ్యక్షుడిగా అయినా ముఖ్యమంత్రిగా అయినా కేటీఆర్‌కి అవకాశమొచ్చినా తాను ప్రశ్నించబోననీ అంటున్నారు.

మొత్తమ్మీద, హరీష్‌కి చెక్‌ పెట్టడానికి, కేసీఆర్‌ – అన్నా చెల్లెళ్ళను ఒక్కతాటిపైకి తెచ్చారంటూ విన్పిస్తోన్న వాదనల్లో నిజమెంతోగాని, కవిత – కేటీఆర్ ఒకే వేదికపై కన్పించడంతో గులాబీ శ్రేణులు మాత్రం ఓ రేంజ్ లో మురిసిపోయాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *