జైట్లీ… నీ సానుభూతి ఎవడికి కావాలి?

ఏపీ రాజకీయాలకు సంబంధించి. కోట్లాది ఆంధ్రా ప్రాంత ప్రజల వరకు బుధవారం (మార్చి 7 – 2018) కీలకమైన తేదీగా చెప్పాలి. భవిష్యత్ రాజకీయాలు.. ఆ మాటకు వస్తే భారత రాజకీయాల వరకూ ఒకకీలకమైన రోజుగా చెప్పక తప్పదు. ఎందుకంటే.. సాయం అడుగుతున్న రాష్ట్రం గురించి పెద్దన్న కుర్చీలో కూర్చున్న ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో అలా వ్యవహరించి తీరని వేదనను మిగిల్చిన రోజుగా చెప్పాలి. నువ్వు ఒక మాట అంటే నేను రెండు మాటలు అంటానన్న రీతిలో కేంద్రం వ్యవహరించిన తీరు స్పష్టంగా బయటపడిన రోజుగా చెప్పాలి.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడితే.. సాయంత్రం అయ్యేసరికి కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పెట్టేసి.. వెనుకా ముందు చూసుకోకుండా.. బాబు మీద ఉన్న కోపాన్ని.. ఆగ్రహాన్ని ఏపీ ప్రజల మీద ఎంత నిర్దయగా ప్రదర్శించారో ఆయన మాటల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సానుభూతి చూపిస్తాం కానీ.. సొమ్ములు ఇచ్చేది లేదని కుండబద్ధలు కొట్టేశారు. ఇంతకీ ఆ డబ్బులు ఎవరికి అంటే.. రాష్ట్రాలవే. అంటే..ఒక రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి ఇస్తే.. అందులో కొంత భాగాన్ని ఉంచేసుకొని.. మిగిలింది రాష్ట్రాలకు ఇస్తుంది. తాను ఉంచుకున్న భాగాన్ని తనకు తోచినట్లుగా ఖర్చు చేయటం తెలిసిందే. సంపన్న రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాన్ని కొంతమేర మాత్రమే ఆ రాష్ట్రానికి ఇస్తూ.. మిగిలింది వెనుకబడిన రాష్ట్రాలకు ఇవ్వటం మొదట్నించి ఉన్నదే. పలు రాష్ట్రాలు కలిసి ఒక దేశమన్న భావనతో కలిసి ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవు.

వంద కోట్ల మందిలో కేవలం ఒక్కరి అయినప్పటికీ కూడా తమరు మాత్రం హస్తిన సర్కారులో ఆర్థిక మంత్రి హోదాలో కూర్చుని ఏలుబడి చేస్తున్నారు. కనీసం రెండు మూడు లక్షల మంది ప్రజల ఓట్లను గెలుచుకొని ఎంపీ అయ్యే సత్తా లేని వ్యక్తి అయినప్పటికీ కూడా, తమరు చేసే ఆర్థిక నిర్ణయాలను కేటాయించే కేటాయింపులు ఈ దేశంలోని వందకోట్ల మంది జనము భరిస్తున్నారు.

కనుక జైట్లీ గారూ మీనుంచి ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నది సానుభూతి జాలి ఎంతమాత్రమూ కాదు. అవి మాత్రమే ఇవ్వగలిగేట్లయితే నీ అవసరం మాకు ఎంత మాత్రమూ లేదు. ఎటూ కేంద్రానికి అయాచితంగా వచ్చే నిధులను ఏమీ లేవని అంటున్నారు గనుక మీ సానుభూతిని జాలిని మూటలుగా కట్టి మీ ఖజానాలోని దాచుకోండి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఈ విభజన చట్టం ద్వారా సంప్రాప్తించే హక్కు. దానిని కాలరాయడం అనేది మీరు చేస్తున్న అతి పెద్ద తప్పు. కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకునే సమయంలో ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ ఉద్యమించిన మీరే పాలనలోకి వచ్చిన తరువాత ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

ఇవ్వడమో ఇవ్వకపోవడమో అనేది మీ జేబులో సొత్తు కాదు. మీ స్వార్జితము పిత్రార్జితము ఎవరూ అడగడం లేదు. కేంద్ర ప్రభుత్వం చట్టం రూపంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రతినిధులు మాత్రమే మీరు. మీ ఇష్టం వచ్చినట్లుగా సుద్దులు చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కు హక్కుభుక్తంగా రావలసిన వాటిని ఎగ్గొడతాం అంటే కుదరదు.

ఈ దేశపు ప్రజాస్వామ్య వ్యవస్థలో మూలస్తంభాలు అన్నీ రాజకీయ వ్యవస్థ అంతగా తుప్పుపట్టి పోలేదు. మీరు చేసిన వంచనను మరో వేదిక మీది నుంచి ఇక్కడి ప్రజలు నిలదీయగలరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అర్హత ఉంటే గనుక దక్కవలసిన వుంటే గనుక ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా సాధించుకోగలరు.

అయాచితంగా ప్రాప్తించిన అధికారహోదా మీలాంటివారికి ఇవ్వాళ వుంటాయి రేపు పోతాయి. ప్రజల ఓట్లను గెలుచుకోగలిగే నాయకులు మాత్రమే స్థిరంగా రాజకీయాల్లో మన గలుగుతారు తప్ప, మీలాగా పార్టీల ప్రాపకంతో అధినాయకుల ఆశీర్వాదాలతో బతికేద్దాం అనుకునేవారికి కలకాలము మనుగడ ఉండదు. ఈ వాస్తవాన్ని ఎంత త్వరగా మీరు గుర్తిస్తే మీకు అంతగా భవిష్యత్తు ఉంటుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *