శశికళపై అశ్విన్‌ గూగ్లీ ..!

టీమిండియా ఆల్ రౌండర్‌ రవిచంద్రన్ అశ్విన్ సోమవారం చేసిన ఓ ట్వీట్ తమిళనాడు వర్గాల్లో పెను చర్చనీయాంశమైంది. సాధారణంగా క్రికెట్ విషయాలు తప్ప మిగితా అంశాలపై పెద్దగా స్పందించని అశ్విన్ తమిళ రాజకీయాలపై ఆసక్తికర ట్విట్ చేశారు. ఇప్పుడు ఇదే తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. అశ్విన్‌ ట్వీట్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. త్వరలో 234 ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయని, తమిళనాడులోని యువకులందరూ సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశాడు.

ముఖ్యమంత్రి అయ్యేందుకు శశికళ చేస్తున్న ప్రయత్నాలపై తమిళులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న వేళ.. అశ్విన్ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అశ్విన్‌ ట్వీట్ కు పలువురు మద్దతుగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. దీనిపై రాద్దాంత కాకముందే అశ్విన్ మరో ట్విట్ చేశారు. తాను చేసిన ట్వీట్ ఒక ఉద్యోగ మేళాకు సంబంధించిందే కానీ.. రాజకీయ కోణంలో తాను ఆ ట్వీట్ చేయలేదని పేర్కొనటం గమనార్హం.

మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేందుకు శశికళ అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా ఆమెను అంగీకరించబోమని చెబుతూ, ‘ఛేంజ్ డాట్ ఆర్గ్’ వెబ్ సైట్లో పెట్టిన పిటిషన్ పై సంతకాలు చేసిన వారి సంఖ్య 55 వేలను దాటింది. నిన్న ఈ పిటిషన్ ప్రారంభం కాగా, నేడు మధ్యాహ్నం 1:15 గంటల సమయానికి దీనిపై సంతకాలు చేసిన వారి సంఖ్య పెరిగిపోతునే ఉంది.

234 ఉద్యోగాలు అంటే తమిళనాడు శాసన సభలో ఎమ్మెల్యేల సంఖ్య. త్వరలో ఉద్యోగావకాశాలు వస్తాయంటే తమిళనాడు శాసనసభ రద్దయి ఎన్నికలు వస్తాయా అని అతని ఫోలోవర్లు తికమకపడ్డారు. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. జయలలిత మరణం, తాజాగా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా, అన్నా డీఎంకే చీఫ్‌ శశికళ ముఖ్యమంత్రి కాబోతున్న తరుణంలో అశ్విన్ ట్వీట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *