ముగిసిన బాల మురళీకృష్ణ అంత్యక్రియలు

చెన్నై : ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ సంగీత ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచుతూ వెళ్లిపోయారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయసు86 సంవత్సరాలు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన భౌతిక కాయానికి బుధవారం మధ్యాహ్నం చెన్నైలోని బీసెంట్‌ నగర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కర్ణాటక సంగీతంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన బాల మురళీ కృష్ణ హిందూస్థానీ , పాశ్చాత్య సంగీతాల్లో కూడా తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. జాతీయ స్థాయిలో పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్న ఆయన తన జీవిత కాలంలో 25 వేలకు పైగా సంగీత కచేరీలు నిర్వహించారు.

దేశ విదేశాలలో కర్ణాటక సంగీతానికి ఎనలేని ఖ్యాతి తెచ్చారు. సంగీతాన్ని ఉగ్గుపాలతోనే అందుకున్న బాల మురళీ తూర్పు గోదావరి జిల్లా రాజోలు సమీపంలోని శంకరగుప్తం గ్రామంలో జులై 6, 1930లో జన్మించారు. బాల మురళీ తండ్రి పట్టాభిరామయ్య. తల్లి సూర్యకాంతమ్మ. పట్టాభిరామయ్య వేణువు, వయొలిన్‌, వీణ వాయిద్యాల్లో విద్వాంసులు. సూర్యకాంతమ్మ వీణ కళాకారిణి. బాల మురళీ తన 8 ఏళ్ళ వయస్సులోనే విజయవాడలోని త్యాగరాజ ఆరాధనోత్సవాలలో తొలి కచేరీ చేశారు. వయోలిన్‌, మృదంగం తదితర వాయిద్యాలపై కూడా బాల మురళీ పట్టు సాధించారు. బాల మురళీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందుకున్న పురస్కారాలు ఎన్నో. భక్త ప్రహ్లాద(1967) చిత్రంలో నారదుడి పాత్రలో అలరించారు. ఆయన సినిమాల్లో కూడా నేపథ్య గానాన్ని వినిపించారు. 1957 నుంచి నేపథ్యగాయకుడిగా సినీ రంగానికి సేవలు అందించారు. గుప్పెడు మనస్సు చిత్రంలోని ”మౌనమే నీ భాష” పాట  ప్రతి ఒక్కరినీ ఆహ్లాద పరిచింది. 1976, 87ల్లో ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు. 1987లో బెస్ట్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌, 2010లో బెస్ట్‌ క్లాసిక్‌ సింగర్‌ అవార్డులు ఆయనను వరించాయి. బాల మురళీ చివరిసారిగా ఏడాది క్రితం జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో కచేరీ చేశారు.

ప్రముఖుల సంతాపం

మంగళంపల్లి బాల మురళీకృష్ణ మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి దిగ్భ్రాంతి చెందారు ఆయన మృతికి సంతాపం తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, చంద్రబాబు, కెసిఆర్‌, ఎపి డిప్యూటి సిఎం చిన రాజప్ప తో పాటు మంగళంపల్లి వద్ద శిష్యరికం చేసిన మోహన కృష్ణ, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కె. విశ్వనాధ్‌, నటుడు కమల్‌ హాసన్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపినవారిలో ఉన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *