‘ప్రపంచ తెలుగు మహాసభ’లో బాలయ్య సవాల్‌

తెలుగు మహా సభల్లో ప్రముఖ నటుడు బాలకృష్ణ ప్రసంగం ఆకట్టుకుంది. ‘ఎన్‌టిఆర్’ అనే మూడు అక్షరాలు వింటే తన రక్తం ఉప్పొంగుతుందని..‘ తెలుగు’ అనే మూడు అక్షరాలు వింటే తన తనువు పులకిస్తుందన్నారు. ఐదు వేల సంవత్సరాల క్రితమే తెలుగు జాతికి పునాది పడిందని బాలయ్య తెలిపారు.

పూజ్య బాపూజీ ‘మాతృభాష తల్లిపాలు లాంటిది’ అని ఒక గొప్ప మాట చెప్పారని, మన వాళ్లకు మాత్రం పరాయి భాష అనే డబ్బాపాలపై మోజు పెరిగిపోయిందని, అమ్మను అమ్మా అని, తండ్రిని డాడీ అని పిలిపించుకుంటున్నారని, పాతికేళ్లు పోతే, ‘మమ్మీ’, ‘డాడీ’ లే అచ్చమైన తెలుగు శబ్దాలు అయిపోయే ప్రమాదం ఉందని బాలకృష్ణ అన్నారు.

ఈ సందర్భంగా బాలయ్య తెలుగు భాషను వర్ణించిన తీరు ఆకట్టుకుంది. ‘తెలుగుభాష ఎంతో రమణీయమైంది. కమనీయమైంది. తెలుగు భాషలో గోదావరి ఒంపులు, కృష్ణవేణి సొంపులు, నెల్లూరి నెరజాణ తనం, రాయలసీమ రాజసం ఉన్నాయి. తెలంగాణ మాగాణం తెలుగు భాష.. కోనసీమ లేత కొబ్బరి నీరు తెలుగు భాష’ అటువంటి భాషను మనం మాట్లాడుకుంటున్నందుకు మనం గర్వపడాలి, అటువంటి జాతిలో పుట్టినందుకు మనం ఆనందించాలి, మన జాతిని, మన భాషను మనం గౌరవించాలి’ అని బాలకృష్ణ అన్నారు. తెలుగు వారిని ఒకచోట చేర్చిన సీఎం కేసీఆర్ సహృదయత, భాషాభిమానానికి యావత్తు ఆంధ్రా, తెలంగాణ ప్రజానీకం తరపున కృతజ్ఞతలు చెబుతున్నానని బాలయ్య అన్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ ఓ సవాల్‌ విసిరారు. మూడు నిమిషాలు ఒక్క పరాయి పదం రాకుండా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా అని సవాల్‌ విసిరారు. కమ్మనైన తెలుగు భాషలో గోదావరి వంపులున్నాయని, తెలంగాణ మాగాణం తెలుగు భాష అని, రాయలసీమ పౌరుషం తెలుగులో ఉంటుందని, కోనసీమ కొబ్బరి నీళ్ల లేతదనం తెలుగు భాషలో ఉందంటూ కవితాత్మకంగా వర్ణించారు. తెలుగు జాతికి గౌరవం దక్కాలంటే ముందు తెలుగు భాషను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *