ఆ కేంద్ర మంత్రికి మళ్లీ నచ్చిన కేసీఆర్

కేంద్ర కార్మిక – ఉపాధి కల్పనాశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తీరే వేరు. మిగతా రాజకీయ నేతల కంటే భిన్నంగా మంచిని ప్రశంసించడం – చెడును తప్పుపట్టడం దత్తన్న స్టైల్. అదే రీతిలో తాజాగా  తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ను మరోమారు పొగిడేశారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లి భేటీ అవడం శుభపరిణామని దత్తత్రేయ అన్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కేసీఆర్ను అనుసరించాలని ఆకాంక్షించారు.

పెద్ద నోట్ల రద్దు వెనుక ఉద్దేశం-ఎదురవుతున్న ఇబ్బందులు- భవిష్యత్ పరిణామాలు తదితర అంశాలపై ప్రధాని మోదీ – సీఎం కేసీఆర్ చర్చించడం హర్షణీయమని దత్తాత్రేయ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తన సలహాలు – సూచనలు అందించడం ప్రశంసనీయమని దత్తన్న వివరించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలకు – ఉద్యోగులకు – కూలీ పనులు చేసుకునే వారికి కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే అయినా ప్రజలు మోదీకి మద్దతుగా నిలిచారని – వారందరికీ తల వంచి నమస్కరిస్తున్నానని ఆయన తెలిపారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే నోట్ల రద్దు అసలు ఉద్దేశమని – ఏఎన్ ఐన్యూస్ ఏజెన్సీ సర్వే ప్రకారం 78 శాతం ప్రజలు దీనిని సమర్థ్ధించారని చెప్పారు. ప్రజలు వ్యతిరేకిస్తే తాము రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండేది కాదని దత్తాత్రేయ అన్నారు. ప్రతిపక్షాలు ఉద్దేశ పూర్వకంగా విమర్శలు చేస్తున్నాయని నల్లధనం పోవాలని పోరాడే వామపక్ష పార్టీలు కాంగ్రెస్ తో కలవడం దురదృష్టకరమని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు తమ పార్టీకి నోటు ఇచ్చి ఓటు వేస్తారని బండారు దత్తాత్రేయ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగి పోయిన దేశ ప్రజలు 1977 సంవత్సరంలో జనతా పార్టీకి నోటు ఇచ్చి ఓటు వేశారని చెప్పిన దత్తాత్రేయ ప్రస్తుతం సైతం అదే పరిస్థితి ఉందని చెప్పారు. నల్లధనాన్ని వెలికి తీసేందుకు ఉగ్రవాదానికి కళ్లెం వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల పేద – మధ్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నల్లకుబేరులు మాత్రం డీలా పడ్డారని ఆయన తెలిపారు. పాక్ నకిలీ కరెన్సీని అరికట్టారని చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *