టెస్టుల్లో సంచలనం!

టెస్టుల్లో సంచలనం నమోదైంది. పసికూనగా ప్రస్థానం ప్రారంభించి.. ఇటీవలికాలంలో దీటుగా ఆడుతున్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు తొలిసారి ఆస్ట్రేలియాపై టెస్టు విజయాన్ని నమోదుచేసింది. నాలుగురోజుల్లో ముగిసిన ఢాకా టెస్టులో బంగ్లాదేశ్‌ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగోరోజు 244 పరుగులకు ఆలౌటయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయింది.  నాలుగోరోజు ప్యాట్‌ కమిన్స్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 33 పరుగులతో అజేయంగా నిలిచిన అతనికి టెయిల్‌ ఎండర్లు మద్దతుగా నిలువకపోవడంతో 20 పరుగులతో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు.

బంగ్లాదేశ్‌ బౌలర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ మరోసారి చెలరేగి.. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన షకీబ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఈ టెస్టులో మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది. అనంతం ఆడిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి 217 పరుగులకే చాప చుట్టేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 221 పరుగులు చేయగా.. 265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు.. బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొలేకపోయారు. షకీబ్‌ (5 వికెట్లు), తైజుల్‌ ఇస్లాం (3 వికెట్లు), మెహిది హసన్‌ (2 వికెట్లు) ధాటికి మరోసారి కంగారుపడి.. 244 పరుగులకు చేతులెత్తేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *