తెలంగాణను సస్యశ్యామలం చేస్తా: KCR

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశంలో ఇప్పటి వరకు అత్యంత వేగంగా నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుగా భక్తరామదాసు ఎత్తిపోతల పథకం చరిత్రలో నిలిచిపోయింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భక్తరామదాసు ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ జాతికి అంకితం చేశారు. భక్తరామదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిరుమలాయపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన సీఎం ఆరునూరైన సాగునీరందించి తీరుతామని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమోస్తదని అన్నదానికి పాలేరులో చేపట్టిన భక్తరామదాసు ప్రాజెక్టు నిదర్శనమన్నారు. దశాబ్దాల కరువు కొరల నుంచి బయటపడ్డామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురయ్యామని …. కానీ సొంత రాష్ట్రంలో ఆ సమస్యలు లేవన్నారు. నేలకొండపల్లిలో భక్తరామదాసు మెమోరియల్‌ నిర్మాణం చేపడదామని సీఎం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేసిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు.

కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు మాగాణిగా మారుద్దామన్నారు. కృష్ణా,గోదావరి నీళ్లతో తెలంగాణను సస్యశ్యామలం చేసి తీరుతానని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తు కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. చిదంబరం అవివేకంతో ప్రభుత్వంపై విమర్శలు చేశాడని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మీ కళ్లకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా రూ. 35 వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. భూనిర్వాసితులకు మెరుగైన నష్ట పరిహారం ఇస్తున్నామని చెప్పారు.

రాబోయే సంవత్సర కాలంలో ప్రభుత్వ ఖర్చుతో ఇంటర్నెట్, మంచినీళ్లు అందించి తీరుతామని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చామని తెలిపారు. పరిపాలన ప్రజలకు చేరువ చేసేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటుచేశామని తెలిపారు. కేజీ టు పీజీ విద్య అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత తమదేనన్నారు. హరితహారం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నమని తెలిపారు.

టీఎస్ ఐపాస్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రూపాయి లంచం లేకుండా పారదర్శకంగా అనుమతులు మంజూరుచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్‌తో ఆడపిల్లలకు సాయం చేస్తున్నామని తెలిపారు.కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చామని ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు.ఇకనైనా ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకోవటం మానాలని కేసీఆర్ సూచించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రతి యాదవ కుటుంబానికి ఒక గొర్రెల యూనిట్ మంజూరు చేస్తామని తెలిపారు. తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేవరకు విశ్రమించేది లేదని తేల్చిచెప్పారు.

ఈ సందర్భంగా పద్మ శ్రీ అవార్డు గ్రహిత వనజీవి రామయ్య దంపతులను సీఎం కేసీఆర్‌ శాలువాతో సత్కరించారు. దీంతో పాటు ప్రాజెక్టు పూర్తి చేసిన కాంట్రాక్టర్‌ కృష్ణారెడ్డిని సీఎం సన్మానించారు.

భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి 2016 ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. 2017 మార్చిలోగా నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ నిర్దేశించికున్న లక్ష్యానికంటే 2 నెలల ముందుగానే ప్రాజెక్టు పూర్తయ్యింది. నిలిచిపోనుంది. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్‌, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలాలకు సాగునీరు అందనుంది. మొత్తం 60వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *