బీజేపీలోకి కర్ణాటక మాజీ సీఎం

రీసెంటుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కర్ణాటక మాజీ సీఎం మాజీ కేంద్ర మంత్రి ఎస్.ఎం.కృష్ణ త్వరలో బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.  కృష్ణ ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ… కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ కూడా పంపారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతారని అంతా ఇప్పటికే ఊహిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే  కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప దీనిపై క్లారిటీ ఇచ్చారు.  ఎస్ ఎం కృష్ణ బీజేపీలో చేరుతున్నారని యెడ్డీ ప్రకటించారు.

బీజేపీలో చేరాలని ఎస్ ఎం కృష్ణ నిర్ణయించుకున్నారని.. ఇంకా దీనికి తేదీ మాత్ర ఖరారు కాలేదని యడ్యూరప్ప చెప్పారు. దీనిపై బీజేపీ అధిష్ఠానంతో చర్చించాక తేదీలు ఖరారు కావొచ్చని తెలుస్తోంది. మాజీ సీఎం కావడం.. ప్రభావవంతమైన నేత కావడం.. జాతీయ స్థాయిలోనూ పేరున్న వ్యక్తి కావడంతో ఆయన చేరిక కార్యక్రమం భారీగా ఉండొచ్చని భావిస్తున్నారు. వీలైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఈ చేరిక ఉండొచ్చని అనుకుంటున్నారు.

కాగా త్వరలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్ఎం కృష్ణ రాక తమకు లాభిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటకలో బీజేపీ బలంగానే ఉన్నా  కాంగ్రెస్ ప్రభుత్వంపైనా పెద్దగా వ్యతిరేకతేమీ లేదు. దీంతో కృష్ణ వంటి సీనియర్ నేతలు బీజేపీలోకి వస్తే కాంగ్రెస్ కు నష్టం కలగనుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *