మాల్యా దెబ్బకు ఐడీబీఐ విలవిల!

బ్యాంకులకు రుణాలు ఎగవేసి లండన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పాపం మరెందరికో చుట్టుకుంటోంది. లిక్కర్ వ్యాపారంలో సక్సెస్ అయిన మాల్యా… ఆ తర్వాత కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరిట ఓ పౌర విమానయాన సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటికే లిక్కర్ వ్యాపారంలో కుబేరుడిగా అవతరించిన మాల్యా… కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం అడిగిందే తడవుగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సహా తొమ్మిది బ్యాంకులన్నీ ఓ కన్సార్టియంగా ఏర్పడి కోరినంత మేర రుణాలిచ్చేశాయి. రుణాలు తీసుకునేంతవరకు బాగానే ఉన్న మాల్యా… ఆ తర్వాత బ్యాంకులకు ముఖం చూపించడమే మానేశారు. రూ.6900 కోట్ల మేర రుణాలు తీసుకున్న మాల్యా… సింగిల్ పైసా కూడా చెల్లించలేదు. అసలు వాయిదాలు కట్టడం తన పని కాదన్న కోణంలో ఆయన వ్యవహార సరళి ఉండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో బ్యాంకులు అంతర్మధనంలో కూరుకుపోయాయి.

ఈ క్రమంలో కాస్తంత ముందుగా మేల్కొన్న ఎస్బీఐ…మాల్యా నుంచి రుణాలను రాబట్టుకునే పనిని మొదలెట్టింది. అయితే ఈ కన్సార్టియం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) మాజీ చైర్మన్ యోగేశ్ అగర్వాల్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. తమ చైర్మన్ లాగానే ఐడీబీఐ అధికారులు కూడా మాల్యా వ్యవహారంలో ముందుకు కదిలేందుకే ఇష్టపడలేదు. ఈ క్రమంలోనే కరెన్సీ కట్టలు నింపిన పెద్ద పెద్ద బ్యాగులను చేతబట్టుకుని మాల్యా… నింపాదిగా లండన్ ఫ్లైట్ ఎక్కేశారు. అప్పటికే ఉద్దశపూర్వక ఎగవేతదారుగా తేలిన మాల్యా… విదేశాలకు వెళుతుంటే… ఏ ఒక్కరు కూడా ఆయనను ఆపేందుకు యత్నించకపోవడం ఇక్కడ ప్రస్తావనార్షం. ఏదేమైనా… మాల్యా లండన్ లో ల్యాండయ్యారు. ఇక తాను ఇప్పుడప్పుడే భారత్ కు రాలేనని కూడా ఆయన తెగేసి చెప్పారు. మాల్యాకు రుణాలిచ్చిన పాపానికి బ్యాంకు అధికారులు దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటుంటే… మాల్యా మాత్రం లండన్ క్లబ్బులు – పబ్బుల వెంట తిరుగుతూ… లండన్ శివారులోని తన విలాసవంతమైన భవంతిలో ఏమాత్రం చీకు చింతా లేకుండా బతికేస్తున్నారు.

దర్యాప్తు సంస్థల నోటీసులు కోర్టు నోటీసులకు ఆయన ఏమాత్రం కూడా స్పందిస్తున్న దాఖలా కనిపించడం లేదు. ఈ క్రమంలో మాల్యాను దేశానికి రప్పించేందుకు సీబీఐ – ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తమ తమ మార్గాల్లో చర్యలు ముమ్మరం చేశాయి. అయినప్పటికీ మాల్యా నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఈ క్రమంలో నిన్న సీబీఐ ఓ కీలక చర్య తీసుకుంది. మాల్యాకు రుణాలివ్వడమే కాకుండా… ఇతర బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేసే విషయంలో కీలక భూమిక పోషించిన ఐడీబీఐ మాజీ చైర్మన్ యోగేశ్ అగర్వాల్ ను అరెస్ట్ చేసింది. యోగేశ్ తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 8 మందిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాజీ సీఎఫ్ ఓ రఘునాథన్ కూడా ఉన్నారు. ఈ చర్యతో మాల్యాను వదిలిపెట్టేది లేదని సీబీఐ తేల్చిచెప్పినట్లైంది. తాను అరెస్ట్ చేసిన యోగేశ్ అండ్ కోను విచారినించనున్న సీబీఐ మరిన్ని కీలక అడుగులు వేసేందుకు కార్యరంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంటే మాల్యా చేసిన తప్పుకు మరింత మంది అధికారులు బలి కానున్నారన్న మాట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *