చిరు బాలయ్యల పరువు తీస్తున్నారు

సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాక దానికి ఎలాంటి పరిమితులు లేకపోవడంతో ఎవరికి తోచింది వాళ్ళు ఎలా కావాలనుకుంటే అలా ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు . ఒకప్పుడు హీరోల అభిమానులు అవతలి హీరోను ట్రాల్ చేయడం కోసం పోస్టర్ల మీద పెడ లాంటివి కొట్టేవారు. తమ హీరో గొప్పని చెప్పుకునేలా కలెక్షన్ల వివరాలు పాంప్లేట్లుగా ముద్రించి ఊరంతా పంచేవారు.
ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. అంత కష్టం ఖర్చు అవసరం లేదు. నెట్ కనెక్షన్ ఉన్న స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ప్రపంచం మొత్తం వైరల్ చేయొచ్చు. ఈ పోకడలో పడి హీరోల అభిమానులు ఒకరిమీద ఒకరు బురద చల్లుకుంటూ తమకు తెలియకుండానే ట్రాలింగ్ పేరుతో హీరోలను చీప్ గా చూపించుకుంటున్నారు. వినయ విధేయ రామలో సీన్లు దారుణంగా ట్రాలింగ్ కు గురయ్యాక దానికి బదులుగా మెగా ఫ్యాన్స్ గతంలో బాలకృష్ణ నటించిన సినిమాల్లోని అలాంటి సీన్లు తీసి పోస్ట్ చేయడం ప్రారంబించారు. కొన్ని ఉదాహరణలు చూస్తే మీకే అర్థమవుతుంది.
ప్రాణానికి ప్రాణం అనే సినిమాలో జైలు ఊచలకు రజని తాళిబొట్టు చిక్కుకుపోతే బాలకృష్ణ వాటిని చేతులతో విరిచేసి ఆమె మంగల్యాన్ని కాపాడతాడు. పట్టాభిషేఖం మూవీలో బైక్ మీద విజయశాంతితో వెళ్తున్న బాలయ్య విలన్ల నుంచి తప్పించుకోవడం కోసం గొడుగు సహాయంతో గాలిలో ఎగిరి ఓ నదిమీదుగా అవతలి ఒడ్డుకు చేరుకుంటాడు. విజయేంద్ర వర్మలో విలన్ ముఖేష్ రుషిని పట్టుకోవడం కోసం బాలయ్య ప్యారచ్యుట్ మీద ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్తాడు. ఇవి మెగా ఫ్యాన్స్ పోస్ట్ చేసిన వీడియోలలో కొన్ని శాంపిల్స్.
ఇక బాలయ్య ఫ్యాన్స్ విషయానికి వద్దాం. స్టేట్ రౌడీలో తన మీదకు దూసుకు వస్తున్న లారీ ని తప్పించడం కోసం చిరంజీవి బైక్ ని చాలా సేపు రివర్స్ లో నడుపుతాడు. ఎలాంటి ఇబ్బంది కనిపించదు. యుద్ధభూమిలో విలన్ నడుపుతున్న హెలికాప్టర్ ను నాగలితో పరిగెత్తుకుంటూ వెళ్లి పెల్చేస్తాడు. ఇద్దరు మిత్రులులో సురేష్ ని భుజం మీద వేసుకుని బ్రిడ్జ్ పై ట్రైన్ కంటే వేగంగా పరిగెత్తుతూ అతనికి ప్రాణాపాయం తప్పిస్తాడు చిరు. ఇవి కూడా ఉదాహరణలు మాత్రమే.
ఈ వీడియోలన్ని ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి. మీ హీరో ఇలా చేసాడు అంటే ఇదుగో మీ హీరో ఇంత కన్నా దారుణంగా చేసాడు అంటూ మిగిలిన వాళ్ళకు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నారు. ఎప్పుడో 80 దశకంలో సినిమాల క్లిప్పింగులన్ని బయటికి తీసి ఇలా కామెడీలు చేయడం వల్ల అభిమానుల ఈగోలు సంతృప్తి పడుతున్నాయి కాని ప్రపంచవ్యాప్తంగా ఇవి ఎక్కడికో చేరిపోయి అనవసరంగా మనవాళ్ళ పరువునే తీస్తున్నాయని గుర్తించకపోవడం విచారకరం.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *