క్లైమాక్స్‌లో తమిళ రాజకీయ పంచాయితీ: అజ్ఞాతంలో 40 ఎమ్మెల్యేలు

చెన్నై: కొద్దిరోజులుగా ఉత్కంఠను రేకెత్తిస్తోన్న తమిళ రాజకీయ పోరు క్లైమాక్స్ కు చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తం వ్యవహారంలో గవర్నర్ పాత్ర కీలకంగా మారడంతో.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు ప్రతీ ఒక్కరి మదిలోను మెదులుతోన్న ప్రశ్న. తాజాగా గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబై నుంచి చెన్నైకి బయలుదేరారు. దీంతో పన్నీర్-శశికళ మధ్య రాజకీయాలు మరింత హీటెక్కాయి. తమ మద్దతుదారులను కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూనే.. ఎలాగైనా సీఎం పీఠాన్ని దక్కించుకోవాలనే తాపత్రయంలో ఇరు వర్గాలు ఉన్నాయి.

కాగా, నిన్నటిదాకా శశికళ వెనుక 131మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వార్తలు రాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 89కి పడిపోయినట్టుగా తెలుస్తోంది. మరో 40మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడం కోసం పన్నీర్-శశికళ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గవర్నర్ గనుక ఇరు వర్గాలను బలనిరూపణకు ఆదేశిస్తే 117మంది ఎమ్మెల్యేల బలం అవసరం అయ్యే అవకాశం ఉంది. అప్పుడు అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యేల పాత్రనే కీలకంగా మారనుంది.

కాబట్టి వీరి మద్దతు ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠను రేకెత్తిస్తోన్న అంశం. కాగా, తన వెనుక ఉన్న ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండటానికి శశికళ జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల సెల్ ఫోన్లను సైతం సెక్యూరిటీ తీసేసుకున్న పరిస్థితి. గవర్నర్ ను కలిసి బల నిరూపణ చేసేంతవరకు వారిని రిసార్ట్ లోనే మకాం వేయాల్సిందిగా శశికళ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే శశికళ, పన్నీర్ లు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరగా.. ఇద్దరిలో ఎవరు ముందుగా గవర్నర్ ను కలవబోతున్నారన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. ఇదిలా ఉంటే, విద్యాసాగర్ చెన్నైకి చేరిన వెంటనే, రాజ్ భవన్ కు వెళ్లి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో పాటు మరికొందరు ఉన్నతోద్యోగులను కలుస్తారని తెలుస్తోంది. ఆపై సీఎం పదవిని కోరుకుంటున్న శశికళ, పన్నీర్ లను పిలిపించవచ్చని సమాచారం. పన్నీర్-శశికళలకు ఉన్న మద్దతును బట్టి.. శశికళ చేత ప్రమాణ స్వీకారం చేయించడమా? లేక బలనిరూపణకు ఆదేశించడమా? అన్నదానిపై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. బలనిరూపణకు గనుక నిర్ణయిస్తే.. ఇందుకోసం కొంత గడువును కూడా నిర్దేశించే అవకాశముంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *