సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. దేశంలోనే తొలిసారిగా అమలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఇప్పటి వరకూ ఎక్కడా ఎవరూ అమలు చేయని రైతు సంక్షేమ పథకాన్ని తెలంగాణలో అమలు చేయడానికి పూనుకొన్నారు! రైతులందరికీ, అన్ని రకాల ఎరువులను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ‘ఉచిత ఎరువుల పథకం’ అమలు చేస్తామని తెలిపారు. ‘‘ఇవ్వాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర. దేశం దేశమే ఆగమైపోతాది. కదులుతాది. కేసీఆర్‌ పుట్టిందే ఇందుకు కావచ్చు. నాకు తెలవదు. తెలంగాణలో రైతులు వాడే 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వంద శాతం ఉచితంగా సరఫరా చేస్తాం’’ అని రైతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 55 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుందని చెప్పారు. ప్రభుత్వ ఖజానాపై ఏటా ఐదారు వేల కోట్ల భారం పడనుందని తెలిపారు. పంట రుణాల మాఫీ పథకం పూర్తయిన సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి రైతులు గురువారం ప్రగతి భవనకు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘‘రుణమాఫీ చేసి ఒక చరిత్ర సృష్టించినం. ఇండియాలో ఏ రాష్ట్రమూ ఇంతవరకూ రూ.17 వేల కోట్ల రుణం మాఫీ చేయలేదు. భారతదేశంలోనే కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నాం. రైతులు వాడే ఎరువులను వందకు వంద శాతం ఉచితంగా సప్లయ్‌ చేస్తం. రాష్ట్రంలోని 55 లక్షల మంది రైతులకు ఎంత భూమి ఉందో.. దానిని పరిగణనలోకి తీసుకుని ఎకరాకు రూ.4 వేల చొప్పున నేరుగా రైతు అకౌంట్‌కు పంపిస్తాం. చినుకు పడకముందే.. మే 30కల్లా రైతు అకౌంట్లో జమ చేస్తాం’’ అని ప్రకటించారు. ఏదైనా పథకం ప్రవేశపెట్టగానే పైరవీకారులు తయారవుతారని, కానీ, ఈ పథకం వంద శాతం నిజాయితీగా అమలు కావడానికి రైతుల నుంచి సహకారం కావాలని సీఎం కేసీఆర్‌ కోరారు. ప్రతి గ్రామం, సర్వే నంబర్లను జాబితా చేసి, కంప్యూటరీకరణ చేస్తారని, రాష్ట్రస్థాయిలో విడుదలైన మొత్తం రైతు ఖాతాలోకి నేరుగా వెళుతుందని చెప్పారు.
ఎరువుల కోసం ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.4,500 వరకు ప్రభుత్వం నుంచి మద్దతు వస్తుందని, ఐదెకరాల రైతు ఎరువుల కోసం రూ.20 వేల వరకూ పెట్టుబడి పెడితే.. ఆ రూ.20 వేలూ ప్రభుత్వమే ఇస్తుందని వెల్లడించారు. పురుగు మందులు మాత్రం రైతులే కొనుక్కోవాలని, విత్తనాల సబ్సిడీ కొనసాగుతుందని తెలిపారు. ‘‘ఒక రైతు బిడ్డగా రైతులకు నేను చేయగలిగిన సేవ ఇదే. రైతు బాగుపడి.. గ్రామాల్లో వేల కోట్ల సంపద సృష్టిస్తే అదే బంగారు తెలంగాణ. రైతులను ఎన్నో రకాలుగా ఆదుకుంటే తప్ప బంగారు తెలంగాణ సాధ్యం కాదు.
ఈ బంగారు తెలంగాణ సాధన కోసమే నేను చావు నోట్లో తలకాయ పెట్టాను. దేవుడు నన్ను బతికించి.. తెలంగాణ రప్పించాడు. చిల్లర రాజకీయాలను పక్కన పెడితే.. ఆరు నూరైనా తెలంగాణ ఉన్నన్ని రోజులూ రైతులకు ఉచిత ఎరువుల పంపిణీ జరిగి తీరాలి’’ అని స్పష్టం చేశారు. రైతులు తమంతట తాము తాము బాగానే ఉన్నామని, 50 శాతం పెట్టుకుంటామని చెప్పేదాకా ఉచితంగా పంపిణీ జరుగుతూనే ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా.. ‘వ్యవసాయానికి 9 గంటలు వద్దు.. 6 గంటలే ఇవ్వాలం’టూ రైతులు అనే దాకా కరెంటు సప్లయ్‌ చేశామని చమత్కరించారు.

గ్రామ రైతు సంఘమంటే వణకాలి

కార్ఖానాల్లో పని చేసే వారికీ యూనియన్లు ఉన్నాయని, కానీ.. రైతులు మాత్రం ఆర్గనైజ్డ్‌గా లేరని సీఎం కేసీఆర్‌ చెప్పారు. రైతు తయారు చేసిన దానికి రేటు చెప్పే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రైతులు ఆర్గనైజ్‌ కావాలని పిలుపునిచ్చారు. ‘‘ఎవరికి భూమి ఉంటే.. వారే రైతు. రైతుకు కులం లేదు. ప్రతి ఊరికీ గ్రామ రైతు సంఘం ఏర్పడాలి. ఈ పనిని వ్యవసాయ శాఖ వెంటనే చేపట్టాలి. గ్రామంలోని రైతు, ఆయనకున్న భూమి, ఆ రైతు అకౌంట్‌ నంబర్లతో గ్రామ రైతుల జాబితా తయారు కావాలి. ఎవరైనా రైతు.. ఎకరం అమ్మితే వెంటనే కంప్యూటరైజ్‌ అయ్యేలా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటుంది. గ్రామ రైతు సంఘమూ అప్‌డేట్‌ కావాలి. గ్రామ రైతు సంఘం అంటే గజ్జున వణికే పరిస్థితి ఉండాలి. అన్ని కులాల రైతులకూ ఇందులో సభ్యత్వం ఉండాలి. ప్రతి గ్రామానికీ గ్రామ రైతు సంఘం రావాలి. వాటిలో డబ్బులు కూడా వేసుకోవాలి. ఒక బృందంగా ఏర్పడి చైనా వంటి ప్రదేశాలకు వెళ్లి ఆధునిక పద్ధతులను చూసి రావాలి. ఇందుకు ప్రభుత్వమూ సహకరిస్తుంది. గ్రామ రైతు సంఘాలు అద్భుతమైన రైతు వేదికలుగా మారాలి’’ అని పిలుపునిచ్చారు.

క్రాప్‌ కాలనీలుగా తెలంగాణ
తెలంగాణను పంట కాలనీలుగా విభజన చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ‘‘ఏ వాతావరణంలో ఏది మేలైన పంటనో.. టెంపరేచర్‌, విండ్‌ వెలాసిటీని బట్టి కార్డులు ఇస్తారు. గొర్రె దాటు లెక్కన పంటలు పెట్టడం వల్లే ధరలు రావట్లేదు రాష్ట్రం మొత్తం వ్యవసాయ క్రాప్‌ కాలనీల కింద విభజన జరగాలి. అప్పుడు అందరి పంటలకూ ధర వస్తుంది’’ అని వివరించారు ‘‘మంత్రి పోచారం శ్రీనివా్‌సరెడ్డి లక్ష్మీపుత్రుడు. స్వతహాగా రైతు బిడ్డ. ఆయన వ్యవసాయ శాఖ తీసుకున్న దగ్గరి నుంచి మంచి విప్లవం జరుగుతోంది’’ అంటూ వ్యాఖ్యానించారు కార్యక్రమంలో ఎంపీ కవిత, ప్రశాంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కవిత హర్షం

వ్యవసాయానికి ఉచితంగా ఎరువుల పంపిణీ చేయాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 55లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని సంతోషం వ్యక్తంచేశారు. ఈ నిర్ణయంతో వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకోవాల్సిన అవసరం రైతులకుండదన్నారు. వెంటనే గ్రామాల వారీగా రైతు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు.

సబ్సిడీ ట్రాక్టర్ల సంఖ్య పెంచుతాం
దేశంలో ఏ రాష్ట్రమూ ఇవ్వనంతగా సూక్ష్మ సేద్యం పరికరాలను ఇస్తున్నామని, ఇందుకు నబార్డు నుంచి రూ. వెయ్యి కోట్ల రుణమూ తెచ్చామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇంకా కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ‘‘సబ్సిడీ ట్రాక్టర్ల సంఖ్యనూ పెంచాలని ఆలోచన చేస్తున్నాం. వచ్చే ఏడాది బడ్జెట్లో పెడతాం. వచ్చే ఏడాది బడ్జెట్‌ పెంచుకుని.. ఎరువుల కోసమూ కేటాయింపులను బడ్జెట్లో పెట్టుకుందాం. బడ్జెట్‌ పాస్‌ కాగానే తొలి చార్జి.. అన్నదాతలైన రైతులకు పోవాలి’’ అని వ్యాఖ్యానించారు.

మూడు నాలుగేళ్లలో కోటి ఎకరాలకు నీళ్లు

ప్రస్తుతం రైతుల పరిస్థితి ‘రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం’ అంటూ గోడ మీద రాసుకున్నట్లుగా ఉందని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రాజెక్టులు రాలేదు. ఉన్న ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటిపోయేవి. బోరు చూపెట్టాలంటే ఒకడు కొబ్బరి కాయ.. ఒకడు రాగి తీగ, ఇంకొకడు తంగేడి పుల్ల పట్టుకుని వచ్చెటోడు. ఒక్క గోస పడ్డమా? చెరువులు తాంబాళం లెక్క తయారైనవి. వాటికి ఎప్పుడైనా మరామత్తులు చేస్తెనా? ఎరువుల బస్తాలు వచ్చినంక పొలానికి మట్టి కొట్టుడూ బంద్‌ చేస్తిమి. అనేక బాధలు పడి చివరికి రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దిగజారిండు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
వంద శాతం తెలంగాణ ఎట్ల తెచ్చినమో.. అట్లనే కోటి ఎకరాలకు నీళ్లూ తెస్తామని ప్రకటించారు. తాను బతికుండగానే వంద శాతం తెచ్చి చూపెడతానని, ఎక్కువ కాలం కూడా కాదని, మూడు నాలుగేళ్లలో పక్కాగా తెచ్చి చూపిస్తామని వెల్లడించారు. ‘‘మేడిగడ్డ నుంచి శ్రీరాంసాగర్‌ నింపుతారు. వర్షం వచ్చినా.. రాకున్నా ప్రతి ఏడూ నిజాం సాగర్‌నూ నింపుకుంటాం. అంత మంచి పాయింట్‌ మేడిగడ్డ.. కాళేశ్వరం దగ్గర దొరికింది. వీడు మొండోడు. వీడు ఇన్ని ఎకరాలకూ నీళ్లు ఇస్తే.. మాకు డిపాజిట్లు వస్తయా, ప్రజలు ఓట్లేస్తరా?’’ అన్నదే వేరే పార్టీ వాళ్ల బాధని వ్యాఖ్యానించారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *