నల్లగొండ ఎంపీ స్థానం నుంచే కేసీఆర్‌ పోటీ..?

జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నాయకుల నుంచి భారీ మద్దతు లభించింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కలిసికట్టుగా కేసీఆర్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నయ శక్తిగా దేశంలో మూడో ఫ్రంట్‌ ఆవశ్యత గురించి సమావేశంలో సీఎం వివరించారు.

 ప్రత్యామ్నయ కూటమి ఏర్పాటు చేస్తే దేశంలో టీఆర్‌ఎస్‌ ముఖ్య భూమిక పోషిస్తుందని అన్నారు. ఈ సమావేశం అనంతరం  జిల్లా మంత్రి జి. జగదీ‹Ôæరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, రవీంద్రకుమార్, భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి,  గాదరి కిశోర్,  ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేంద ర్‌ రెడ్డి, రాష్ట్ర నాయకులు చాడ కిషన్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, మధర్‌ డెయిరీ చైర్మన్‌ గుత్తా జితేందర్‌రెడ్డి,  నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కంచర్లభూపాల్‌ రెడ్డి, నోముల నర్సింహయ్య తదితరులు సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

నల్లగొండ నుంచే పోటీ..!
సాధారణ ఎన్నికలకు ఏడాది ముందుగానే జాతీయ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని సీఎం ప్రకటన చేయడంపై నల్లగొండ జిల్లా నాయకులు ఉత్సాహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచే కేసీఆర్‌ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజా పరిణామలు.. అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. నల్ల గొండ పార్లమెంట్‌ స్థానం నుంచి కేసీఆర్‌ బరిలో దిగితే ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు టీఆర్‌ఎస్‌ వశమవడం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ నిర్వహించే సర్వేలో జిల్లాలో మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని తేలింది కాబట్టి, ఎంపీగా కేసీఆర్‌ ఇక్కడి నుంచే పోటీ చేస్తే తమకు మరింత మేలు జరుగుతుందని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *