వృద్ధుడికి వరాలు ఇచ్చిన సి‌ఎం కేసీఆర్

గురువారం మధ్యాహ్నం హైదరబాద్ నగరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లారు. తిరిగి వస్తుండగా మార్గమధ్యలో వికలాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. కేసీఆర్ ఆ మార్గంలో వస్తున్నట్లు తెలుసుకున్న వృద్ధుడు వెంటనే దరఖాస్తుతో రోడ్డు మీదకు వచ్చారు. అతడిని గమనించిన కేసీఆర్ తన వాహనశ్రేణిని ఆపించి కారు దిగి ఆగారు. ఆయన దగ్గరికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. తనకు తానుగా మొహమ్మద్ సలీమ్‌గా పరిచయం చేసుకున్న ఆ వృద్ధుడు ముఖ్యమంత్రి వద్ద తన గోడు వెళ్లబోసుకున్నారు. సలీమ్ సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని చెప్పారు. అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ శ్వేతా మహంతి టోలి చౌకిలో సలీమ్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. సలీమ్ వికలాంగుడని ధ్రువీకరిస్తూ సదరం సర్టిఫికెట్ కూడా ఉండటంతో అప్పటికప్పుడు పింఛన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీమ్‌కు వైద్య పరీక్షలు చేయించి, చికిత్స చేయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధ పడుతున్న అతడి కుమారుడికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. దీంతో ఆ పెద్దాయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆనందంతో ఆయన సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ చెబుతూ కరచాలనం చేశారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *