పిల్లల్ని పెంచినట్లే మొక్కలను పెంచండి : కేసీఆర్‌

పిల్లల పేరుతో మొక్కను పెంచండి..
‘కరీంనగర్‌ పట్టణానికి వస్తున్నప్పుడు.. మానేరు నుంచి ఇక్కడకు చేరుకున్నప్పుడు సుమారు 70వేల మంది స్వాగతం చెప్పారు. కరీంనగర్‌ గొప్ప మేధోశక్తి ఉన్న పట్టణం. రచయితలు, కళాకారులు, రాజకీయ నేతలు, విద్యార్థులు ఉన్న గడ్డ ఇది. అందరికీ పాదాభివందనం చేసి విజ్ఞప్తి చేస్తున్నా.. పిల్లవాణ్ని ఎలా పెంచుతారో.. పిల్లల పేరుతో మొక్కను పెంచండి. మొక్కల పెంపకం మన సొంతపని. ఇంటిపని. మన జీవితంతో పెనవేసుకుంటుంది మొక్క. పుట్టిన నాటి నుంచి ఆలంబనగా మనతో పాటు ఉండే చెట్టును అపురూపంగా పెంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎక్కడైతే ప్రకృతిని పూజిస్తారో.. మొక్కలు నాటుతారో అక్కడ ప్రకృతి హర్షిస్తది.. వర్షిస్తది. ఈ జిల్లా నుంచి ప్రారంభమయ్యే హరితహారంతో చెరువులు, కుంటలు నిండి భూముల్లో తేమశాతం పెరుగుతుంది. జిల్లా కలెక్టర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌, సీపీ కమలాసన్‌రెడ్డి హరితహారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అద్భుతమైన చొరవ ప్రదర్శిస్తున్నారు. నగరంలో 25వేల మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడతామన్నారు. వారికి ధన్యవాదాలు.

ఇక్కడి నుంచి ఏ పని ప్రారంభించినా విజయమే..
మరో రెండేళ్లలో నేను ఇక్కడకు వస్తే ఇళ్ల కంటే ఎక్కువగా చెట్లే కనబడాలి. ఆ స్థాయికి ఈ ప్రాంతం ఎదగాలి. ఇక్కడి నుంచి ఏ పని ప్రారంభించినా విజయం సాధించాం. తొలుత నేను సింహగర్జన కోసం తొడగొడితే ఎవరికీ నమ్మకం కుదరలేదు. కానీ తెలంగాణ వచ్చింది. తెలంగాణ తెస్తానని చెప్పా.. సాధించి రుజువుచేసి చూపా. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు రావాలి. భూమిలో తేమ శాతం పెరగాలి. నీళ్లు రావాలి. పచ్చదనంతో అలరారాలి. పంటలు పండాలి. పరిశ్రమలు రావాలి. పచ్చదనం లేకపోతే ఎండాకాలంలో 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు వస్తున్నాయి. ఇది మానవాళి మనుగడకే ముప్పు. అందరూ చెట్లు పెంచే కార్యక్రమాన్ని ప్రతిజ్ఞలా తీసుకోవాలి. తెలంగాణ జాతిలో ఉన్న పౌరుషాన్ని మేలుకొల్పాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *