దిల్లీ చక్రవర్తులకు గులాములు కావద్దు ..కోటి ఎకరాలకు నీళ్లిచ్చి ఆకుపచ్చ తెలంగాణ చూపిస్తా

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం కృషిచేస్తున్న తెరాస ప్రభుత్వాన్ని మళ్లీ దీవించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఆయన ప్రజలకు వివరించారు. తెలంగాణలో అన్ని వర్గాల వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుంటూ..పెరిగిన ఆదాయాన్ని ప్రజలకు పంచుతామన్నారు. పింఛన్లు పెంపుతోపాటు నిరుద్యోగులకు అండగా నిలుస్తామన్నారు. ‘‘పింఛనును ఎక్కడ నుంచి ఎక్కడికి తీసుకోపోయామో తెలుసు. కానీ ఇవన్నీ సరిపోవు. కేసీఆర్‌ మాటలు చెప్పడు.. కోటి ఎకరాలకు నీరు అన్నారు. కొన్ని ప్రారంభమయ్యాయి. సంవత్సరానికి 100 టీఎంసీలు తీసుకునేలా మల్కాపూర్‌ రిజర్వాయర్‌ను మొన్ననే అనుమతి చేయించుకున్నాం. రాబోయే రోజుల్లో కోటి ఎకరాలకు నీరిచ్చి ఆకుపచ్చ తెలంగాణ చేస్తాం. తెలంగాణ రైతాంగం బాగుపడాలి. రైతులు మీదికి చూస్తే పటేల్‌ అంటారు.. భుజం మీద తువ్వాల్‌ వేసుకుని తిరుగుతారు.. కానీ అప్పులేని రైతుల్లేరని మీకందరికీ తెలుసు. ఒక ఐదారేళ్లు రైతుబంధు కొనసాగిస్తే వారి జేబులోనూ రెండు మూడు లక్షలు ఉంటాయి. రూ.5.500 కోట్ల రైతుబంధుకు డబ్బు పంపించాను. రైతు ఎవరికి దండం పెట్టలేదు. ఎవరికీ ఏకాణీ లంచం ఇవ్వలేదు. మీ ఊరికే మీ ఎమ్మెల్యే ఇంటికి వచ్చి చెక్కు చేతుల్లో పెట్టారు. రెండో పంటకు నవంబరులో డబ్బు వస్తుంది. గత 80 ఏళ్లుగా ఎవరూ ముట్టుకోని భూరికార్డులు ప్రక్షాళన చేశాం’’ అని ఉద్ఘాటించారు.

ఆత్మగౌరవంతోని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్న టీఆర్‌ఎస్ ఉన్నయి. మనకు ఏం గావాల్నో.. ఏం మంచో ఇక్కన్నే నిర్ణయాలు తీసుకుంటున్నం. కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాంలుగా ఉందాం.. ఢిల్లీ చక్రవర్తులకు సామంతులుగా ఉందామని చెప్తున్నయి. తెలంగాణ ప్రజలు, మేధావులు, రచయితలు, కళాకారులు, కవులు ఆలోచన చేయాలే. తెలంగాణకు సంబంధించిన నిర్ణయాధికారం తెలంగాణలో ఉండాల్నా.. ఢిల్లీ దొరల కింద ఉండాల్నా? అధికారం మన దగ్గరుంటే ఆత్మగౌరవంతో ఉంటాం. అదే ఢిల్లీ పాలకుల వద్ద ఉంటే, అసెంబ్లీ టికెట్లు కూడా తెలంగాణలో ఇయ్యరు. ఢిల్లీ గుమ్మాల కాడ కాపలా కాసి తెచ్చుకోవాలే. చెంచాగిరి చెయ్యాలే. ఢిల్లీకి చెంచాగిరి చేసే గులాంలమైదామా? లేక తెలంగాణ గులాబీలుగా స్వతంత్ర జీవితం గడుపుదామా? దయచేసి ప్రజలు ఆలోచించాలే. ఎట్టి పరిస్థితుల్లో బానిసలం కాకూడదు. మనకు మనమే ఉండాలె. మన తమిళ సోదరులు బ్రహ్మాండంగా ఏ విధంగా తమిళం గొప్పతనాన్ని కాపాడుకుంటూ, ఏ ఇతర పార్టీలు రాకుండా వారే ఏ విధంగా వాళ్ల రాష్ర్టాన్ని ఆత్మగౌరవంతో పరిపాలించుకుంటున్నరో అదే మార్గంలో తెలంగాణ కూడా ఒక్కటిగా ఉందాం. ఢిల్లీకి మనం బానిసలం, గులాంలం కావద్దు. అది మన భవిష్యత్‌తరాలకు మంచిది కాదు. నిర్ణయాధికారం మన చేతుల్లో ఉండాలని మనవిచేస్తున్న. ఆనాడు 19 ఏండ్ల కింద ఉద్యమానికి బయలుదేరిన్నాడు.. మాట తప్పితే, మడమ తిప్పితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన. మీరు అధికారం ఇస్తే ఎంత గొప్పగా ప్రభుత్వాలు పనిచేయవచ్చో మీకు అమలుచేసి చూపించినాను. మళ్లీ ప్రజలు దీవిస్తే అద్భుతంగా కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణగానీ, సమూలంగా పేదరికం నిర్మూలించడంగానీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు విరివిగా పెంచడంగానీ.. వీటన్నిటినీ భగవంతుని దయతో తప్పకుండా సాధించిపెడుతాను. మీ ఆశీర్వచనం ఉండాలి.

అప్పటికే తెలంగాణ అంటే అలుసైపోయింది. ఏం చేయగలుగుతారులే తెలంగాణ అమాయక ప్రజలనే స్థాయికి అప్పటి పాలకులు వెళ్లిపోయారు. ఏదైనా చేస్తే కేసులు పెట్టి, లాఠీచార్జీలు చేసి అవసరమైతే కాల్చి పారేస్తాం అనే అహంకారంలో ఉన్నారు. ఎందుకంటే అప్పడు ఎన్డీయే ప్రభుత్వంలో వాళ్ల హవానే నడుస్తోంది. కేంద్రం, రాష్ట్రం వాళ్ల చేతుల్లో ఉన్నాయి. 20 ఏళ్లు మేమే ఉంటామనే అధికార మదంతో విర్రవీగిన వాళ్ల కళ్లు మూసుకుపోయి ఉన్నాయి. అందరూ అనుకున్నట్టు తెలంగాణ ఉద్యమం 2001 ఏప్రిల్‌ 27న ప్రారంభం కాలేదు. అసలు ఉద్యమానికి బీజం పడింది ఆనాడు నేను రాసిన లేఖతోనే. 9–10 నెలలపాటు విపరీత మేధోమథనం చేశాం. ఏం చేయాలి… ఏం చేయగలం… ప్రత్యామ్నాయమే లేదా .. కళ్లలో నీళ్లు దిగమింగుకోవడమేనా? అని ఆలోచించాం. ఇందుకోసం ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదు. చుట్టూ పిడికెడు మందితో చిమ్మచీకటిలో ప్రయాణం ప్రారంభించాం.

ఆరేడు నెలలపాటు మేధోమథనం తర్వాత తెలంగాణ రావాల్సిందే… పోరాడాల్సిందే.. గత్యంతరం లేదనే స్థిర నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయం కోసం మార్గం ఏమిటి? కారుచీకట్లో గుండె దిటవు చేసుకుని భగవంతుని స్మరించుకుని ధర్మం, న్యాయం ఉంటే తెలంగాణ సమాజం విజయం సాధిస్తుందనే నమ్మకంతో హింస లేకుండా కొనసాగే ప్రశాంత ఉద్యమం చేపట్టాం. రాజకీయ పద్ధతిలోనే తెలంగాణ సాధించాలని సంకల్పించి ఆ బాట పట్టాం.

గులాబీ జెండా పని అయిపోయిందని ప్రచారం మొదలుపెట్టారు. ఆనాడు తెలంగాణలో ఉన్న అధికారపార్టీ పెద్దలు, ఇతర పార్టీల పెద్దలు తెలంగాణ ఎక్కడ వస్తదని అవహేళనచేశారు. కానీ మనం ఏనాడూ ధైర్యం వీడలేదు. ఈ రోజు కరీంనగర్ ఎంపీగా ఉన్న వినోద్‌కుమార్, నేను ఒకసారి హుస్నాబాద్ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నం.. రాత్రి మూడు అయితుంది! సార్ ఏమైతది ఈ పోరాటం? ఎక్కడిదాకా పోతది? అని వినోద్ నన్ను అడిగారు. మన మొండి పట్టుదల, ధైర్యంపైన ఆధారపడతది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం దీన్ని కొనసాగించగలిగితే.. ఒకనాటికి తెలంగాణ సమాజం మొత్తం ఒక దిక్కే నిలబడి, బరిగీసి మరీ తెలంగాణ కావాలని దేశాన్ని అడుగుతది. ఆరోజుదాకా మనం పనిచేయాలని అప్పడు చెప్పాను. యావత్ ప్రజానీకం మద్దతుతో 2001న జలదృశ్యంలో పిడికెడు మందితో నేను ఒక ప్రతిజ్ఞ తీసుకున్నను.. ప్రాణంపోయినా మడమ తిప్పను, ఉద్యమబాట వీడను, ఎత్తిన జెండా దింపను. ఒకవేళ దించితే నన్ను రాళ్లతో కొట్టండి అని చెప్పిన. నా మాటలు తెలంగాణ ప్రజలు విశ్వసించారు.. అద్భుతాలు చేశారు.

కేంద్ర మంత్రిగా ఉన్నపుడు దిల్లీలో 36 పార్టీలను పదేపదే కలిశాను. ఒక్క సీపీఐ కార్యాలయానికే 38 సార్లు వెళ్లాను. సీపీఐ జాతీయ కార్యదర్శి ఎ.బి.బర్దన్‌ను కలిసి ఒప్పించాను. నీవేమైనా పిచ్చోడివా అని అప్పుడు అన్నారు. అవును నేను తెలంగాణ పిచ్చోన్నే అన్నాను. సీపీఐని ఒప్పించి వచ్చి జయశంకర్‌ సారుతో కలిసి పండగ చేసుకున్నాను.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *