రెడ్డి హాస్టల్‌కు ఎన్ని కోట్లైనా ఇస్తా.. కేసీఆర్‌ ప్రకటన

‘‘రాజా బహద్దూర్‌ వెంకటరామిరెడ్డి(ఆర్‌బీవీఆర్‌ఆర్‌) చాలా గొప్ప వ్యక్తి. తెలంగాణ వైతాళికుడు. ఆయన స్థాపించిన సంస్థలను తెలంగాణ చారిత్రక వారసత్వ సంపదగానే భావించాలి. ఆయనను తలుచుకుంటేనే బర్కత్‌ అవుతది. బాలికల కోసం కూడా ప్రత్యేక వసతి గృహాన్ని ఆనాడే ఏర్పాటు చేశారు. అందుకే రెడ్డి హాస్టల్‌కు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. రూ.10 కోట్లు ఇచ్చాం. ఇంకా కావాలంటే మరో రూ.10 కోట్లు అయినా ఇస్తాం. ఇంకో రూ.10 కోట్లు కూడా ఇతరుల నుంచి ఇప్పిస్తాం. అలాంటి వ్యక్తి పేర ఈ స్థలంలో భారీ విద్యా సంస్థ రావాలి. ఆర్‌బీవీఆర్‌ఆర్‌ పేరు చరిత్రలో చిరస్థాయిలో నిలిచేలా మూడు, నాలుగు విద్యా సంస్థల టవర్లు ఈ కొండపై నిర్మించాలి. ఆ టవర్లు హైదరాబాద్‌ అంతా కనిపించాలి. మంచి కోర్సులు ఇందులో ఉండాలి.
ఐఎస్‌బీలాంటి సంస్థలాగా తీర్చిదిద్ది దేశంలోని ప్రముఖ కంపెనీలు ఇక్కడికే వచ్చి క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా తీర్చిదిద్దాలి. ఇదే నా ఆకాంక్ష. కోరిక’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.
హైదరాబాద్‌ శివారు బుద్వేల్‌లో రెడ్డి హాస్టల్‌కు కేటాయించిన స్థలంలో నిర్మాణానికి మంగళవారం సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ‘‘ఆర్‌బీవీఆర్‌ చారిత్రక పురుషుడు. పుట్టుకతోనే ధనవంతుడు. వనపర్తి సంస్థానాధీశుల వారసుడు. అయినప్పటికీ పేదల విద్య కోసం తపించారు. ఆయన పేరిట నెలకొల్పుతున్న హాస్టల్‌కు భూమి, నిధులు కేటాయించాం. ఆయన కోసం ఏం చేసినా చంద్రునికో నూలుపోగు లాంటిదే. స్థలం-డబ్బులు ఇవ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వ కర్తవ్యంగా కూడా భావిస్తున్నాం.
ఆయనను స్పూర్తిదాయకంగా తీసుకుని ముందుకు పోదాం’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘‘ఇదే స్థలానికి ఆనుకుని ఉన్న మరో ఐదెకరాల స్థలాన్ని కూడా రెడ్డి హాస్టల్‌కు కేటాయిస్తాం. నారాయణగూడలో ఐపీఎం కేంద్రానికి సంబంధించిన స్థలంలో ఉన్న రెడ్డి బాలికల వసతి గృహ విస్తరణ కోసం 1500 గజాలు కూడా కేటాయిస్తాం. ఈ రెండింటిపై బుధవారమే ఉత్తర్వులు ఇస్తాం’’ అని కేసీఆర్‌ హామీనిచ్చారు. ఇక్కడ నిర్మించే విద్యా సంస్థల భారీ టవర్లకు అవసరమైతే ఇతరుల నుంచి సహాయం అందేలా చూస్తామన్నారు. ఆయన విద్యా సంస్థల్లో చదివిన వారు దేశ, విదేశాల్లోనూ ఉన్నారని, వారంతా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సభకు హాజరైన శాంతా బయోటెక్‌, జీవీకే, రెడ్డి ల్యాబ్స్‌ సంస్థల అధిపతులను సీఎం తన ప్రసంగంలో మధ్యలో వేదికపైకి ఆహ్వానించారు. ఆ సంస్థల అధిపతులను ప్రశంసించారు. శాంతా బయోటెక్‌ ద్వారా విదేశాల్లోనూ కలరా వ్యాధికి టీకా మందు పంపిణీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
మధుమేహ బాధితులకు తక్కువ ధరలో ఇన్సులిన్‌ను అందించేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ వైతాళికులను సమైక్య సర్కారు పట్టించుకోలేదని, వారిని స్మరించుకొనే అవకాశం దక్కడం తన అదృష్టమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు. ‘‘ఆర్‌బీవీఆర్‌ చాలా గొప్ప వ్యక్తి. నైజాం ప్రభుత్వంలో డీజీపీ స్థాయిలోలో పని చేశారు.
పాత బస్తీలో దళితుల కోసం విద్యాసంస్థను స్థాపించారు. మొత్తంగా 14 సంస్థలు నెలకొల్పినా ఆయన పేరు, ఊరు ఎక్కడా ఉండేది కాదు. సురవరం ప్రతాపరెడ్డి ఆయనపై పుస్తకం రాయడంతో కొంత వెలుగులోకి వచ్చింది. ఈయన గొప్పదనం ఉద్యమ సమయంలో గుర్తించా. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే పోలీస్‌ అకాడమీకి ఆయన పేరు పెట్టాం’’ అని చెప్పారు. ‘‘వరంగల్‌లో ధర్మారెడ్డి ఉండేవారు. హౌసింగ్‌ బోర్డు ఛైర్మన్‌గా, హౌసింగ్‌ మంత్రిగా కూడా పని చేశారు. ఆసియాలోనే అతిపెద్ద కాలనీ నిర్మించారు. ధర్మారెడ్డి కాలనీగా దానికి పేరుండేది. దానిని కూడా కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డుగా మార్చేశారు. 2001లో అక్కడికి వెళ్లిన నేను ధర్మారెడ్డి కాలనీ బోర్డు పె ట్టించా. ఆ కాలనీ బోర్డు తీస్తే తాటతీస్తా అని హెచ్చరించా’’ అని సీఎం గుర్తు చేసుకున్నారు.
‘‘కొండా రామచంద్రారెడ్డి, వెంకటరంగారావు లాంటి వారు కూడా విద్యా సంస్థలు నెలకొల్పారు. చారిటీ స్కూల్‌ కోసం 700 గజాల స్థలం కోసం ఎక్కని మెట్టు లేదు. మొక్కని బండ లేదు. గత ప్రభుత్వాలు ఏవీ ఇవ్వలేదు. మేం రాగానే స్థలం కేటాయించాం’’ అని చెప్పారు. ‘‘అంబేద్కర్‌ కంటే గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. నిజాం ప్రభుత్వంతో పోరాడి నాడే దళితులకు రిజర్వేషన్లు కల్పించారు. ఆయన పేరు కూడా ఎక్కడా కనిపించదు’’ అని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రావి నారాయణరెడ్డి పేరు కూడా ఎక్కడా కనిపించదని అన్నారు. ఈ సమావేశంలో ఆర్‌బీవీఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధ్యక్షుడు ఎడ్ల రఘుపతిరెడ్డి, శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రి ఎం.మహమూద్‌ అలీ, మంతుల్రు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, హరీ్‌షరావు, ఈటల రాజేందర్‌, పోచారం శ్రీనివాసరెడ్డి, కేటీఆర్‌, లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాల్క సుమన్‌, రాజేంద్రనగర్‌ శాసనసభ్యుడు ప్రకాశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *