క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో కన్నుమూత

హవానా: క్యూబా మాజీ అధ్యక్షుడు , కమ్యూనిస్టు విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో కన్నుమూశారు. 90 ఏళ్ల క్యాస్ట్రో వయోభారం వల్ల కలిగిన అస్వస్థతతో శనివారం తుదిశ్వాస విడిచారు. అర్ధ శతాబ్దం పాటు క్యూబాను ఒంటి చేత్తో పరిపాలించిన ఆయన… 2008లో అధికార పగ్గాలను తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోకి అప్పగించారు. 1926 ఆగస్టు 13న జన్మించిన ఆయన పూర్తి పేరు ఫిడెల్ అలెహెంద్రో క్యాస్ట్రో రుజ్.

అగ్రదేశం అమెరికాను గడగడలాడించిన  ఆయన… క్యూబాలో విప్లవోద్యమాన్ని రగిలించి పశ్చిమార్థ దేశాల్లో తొలి సామ్యవాద దేశంగా తీర్చి దిద్దారు.

యుక్త వయసు నుంచే విప్లవ భావాలు కలిగిన ఫిడెల్ హవానా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సామ్యవాద భావాలతో బలమైన బంధం ఏర్పరచుకున్న ఫిడెల్ తమ్ముడు రౌల్ క్యాస్ట్రోతో కలిసి 1953లో అప్పటి క్యూబా మిలటరీ నియంత ఫుర్జెసియో బటిస్టాపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తమ్ముడితో కలిసి బందీగా చిక్కిన ఫిడెల్‌ 15 ఏళ్ల కారాగార శిక్ష ఎదుర్కొని రెండేళ్ల అనంతరం క్షమాభిక్షతో బయటపడ్డారు. అనంతరం రౌల్, చేగువేరాతో పాటు ఎంతోమంది యువతను చేరదీసి, గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇచ్చిన ఫిడెల్.. 1959, జనవరి 9న బటిస్టా ప్రభుత్వాన్ని గెరిల్లా యుద్ధంతో గద్దె దింపారు. 1959లోమ కేవలం 33 ఏళ్ల వయసులో క్యూబా త్రివిధ ధళాల అధిపతి పగ్గాలు చేపట్టిన ఫిడెల్ నెల రోజుల్లోనే ఆ దేశ ప్రధానిగా అధికారం చేపట్టారు. నాటి నుంచి 1976 వరకు క్యూబా ప్రధానిగా పనిచేసిన ఫిడెల్.. 1976 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా క్యూబాకు మార్గనిర్దేశం చేశారు.

అమెరికా సామ్రాజ్యవాద విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించడంతో… తన గూఢాచార సంస్థ సీఐఏతో క్యాస్ట్రోను హత్య చేయడానికి అమెరికా మొత్తం 638 సార్లు విఫలయత్నం చేసింది. అయినప్పటికీ నిత్యం అప్రమత్తంగా ఉండే ఫిడెల్ క్యాస్ట్రో.. అమెరికా కుట్రలన్నీ ఛేదించి మృత్యుంజయుడిగా నిలిచారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *