దాసరి.. నెరవేరని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇవే..

ఒక జోనర్ అని కాదు.. ఒక ధోరణి అని కాదు… దాదాపు అన్ని రకాల సినిమాలూ తీసిన ఘనత దాసరిది. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.. ఇలా టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేయడమే కాదు, అంతకు మించి చిన్న సినిమాలతో పెద్ద విజయాలను అందుకున్న ఘనత దాసరి నారాయణ రావుది.

వంద సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ అనే ఫీట్ ను తొలిసారి సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన దర్శకుడాయన. నూటా యాభైకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి, అనేక సినిమాల్లో నటించి, బోలెడన్ని సినిమాలను నిర్మించిన నేపథ్యం దాసరిది.

కేవలం సినిమాలే కాదు.. సీరియళ్ల రూపకర్తగానూ, నవలా రచయితగా కూడా దాసరి ప్రత్యేకత దాసరిదే. మరి ఇలా బహుముఖంగా తన ప్రతిభా పాటవాళ్లను చాటుకున్న నారాయణ రావుకి కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తుదిశ్వాస విడిచేంత వరకూ సినిమాల కోసమే తపించారు దాసరి. సినిమాలే ధ్యాసగా బతికారు.

కొన్నాళ్లుగా దాసరి వివిధ ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తూ వచ్చారు. తన డ్రీమ్ ప్రాజెక్టులేవో చెబుతూ వచ్చారు. వాటిలో ముఖ్యమైనది “మహాభారతం”. మహాభారత కథను సినిమాగా తెరకెక్కించాలని ఉందని దాసరి కొన్నాళ్ల కిందట చెప్పారు. వివిధ భాగాలుగా ఆ సినిమాను రూపొందిస్తానని.. భారీ బడ్జెట్ తో రూపొందిస్తానని దాసరి చెప్పారు.

ఇక కేవలం మహాభారతమే కాదు.. కొంత కాలంలో దాసరి నిర్మాణ సంస్థ నుంచి వివిధ టైటిళ్లు రిజిస్టర్ అయ్యాయి. వాటిల్లో ‘సన్’ ‘అమ్మ’ వంటి సినిమాలు ఉండటం గమనార్హం. సన్ అనే సినిమాతో తన తనయుడు అరుణ్ కుమార్ ను రీ లాంఛ్ చేయాలని దాసరి భావించాడని కొంతమంది అంటారు. ఇక ఇటీవల తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా దాసరి ‘అమ్మ’ అనే సినిమాను రూపకల్పన చేయ సంకల్పించినట్టుగానూ వార్తలు వచ్చాయి.

అలాగే దాసరి, పవన్ కల్యాణ్ కాంబోలో ఒక సినిమా ప్రతిపాదనలో ఉండింది. కలిసి పనిచేసే ఆలోచన ఉన్నట్టుగా దాసరి, పవన్ ఇద్దరూ ప్రకటించుకున్నారు. దాసరి స్వర్గస్తులవ్వడంతో ఈ సినిమాలన్నీ కేవలం ప్రతిపాదన దశతోనే ఆగిపోయినట్టే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *