చావుబతుకుల్లో మాఫియా డాన్‌..వెంటిలేటర్‌పై రోజులు లెక్కపెడుతున్న దావూద్

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. అండర్ వరల్డ్ డాన్.. భారత్ లో ఏ ప్రభుత్వం పవర్లో ఉన్నా.. ఏ మాత్రం పీకలేని శక్తివంతుడిగా చెప్పుకునే దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు భారత ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తున్నట్లు చెప్పినా.. అవన్నీ మాటలకే పరిమితమయ్యాయే కానీ చేతల వరకూ వెళ్లలేదు.

దేశ ప్రధానిగా మోడీ పవర్ లోకి వస్తే దావూద్ ఆట కట్టిస్తారని.. ఆయన్ను అదుపులోకి తీసుకొని భారత్కు తీసుకొస్తారంటూ చాలానే ప్రచారం జరిగింది. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తి అయినా.. దావూద్ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. ఆ మధ్యన దావూద్ను అదుపులోకి తీసుకునేందుకు భారత సర్కారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ.. అవేమీ నిజం కాలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా దావూద్ కు గుండెపోటు వచ్చినట్లుగా చెబుతున్నారు. గడిచిన కొంతకాలంగా పాక్ లోని కరాచీలో ఉంటున్న దావూద్ శుక్రవారం తీవ్ర గుండెపోటుకు గురయ్యారని.. ఆయన్ను కరాచీలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దావూద్ గుండెపోటు విషయాన్ని అతడి కుడి భుజం చోటా షకీల్ మాత్రం ఖండిస్తున్నారు. ఇంకోవైపు దావూద్ ఇబ్రహీం ఆరోగ్యానికి సంబంధించి మరికొన్ని వార్తా సంస్థల కథనాలు మరోలా ఉన్నాయి. దావూద్ చావుబతుకుల మధ్య ఉన్నాడని.. వెంటిలేటర్ మీద రోజులు లెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినట్లుగా వస్తున్న వార్తలకు విరుద్దంగా బ్రెయిన్ ట్యూమర్ తో ఆసుపత్రిలో చేరిన దావూద్కు ఆపరేషన్ చేయగా.. అది ఫెయిల్ అయ్యిందని.. దీంతో అతడు వెంటిలేటర్ మీద రోజులు లెక్కిస్తున్నట్లుగా చెబుతున్నారు.20 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన దావూద్కు ఆపరేషన్ చేయటం.. అది వికటించిందంటున్నారు.

దావూద్ ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో దక్షిణ ముంబయిలోని దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ ఇంటికి జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. పలువురు దావూద్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవటానికి ఇంటి ముందు బారులు తీరటం గమనార్హం. డాన్ ఆరోగ్యంగా ఉండాలంటూ ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తానుకానీ చనిపోతే తన అంతిమ సంస్కారాల కోసం దక్షిణ ముంబయిలోని చుర్నీరోడ్ లోని బడా ఖబరస్థాన్లో స్థలాన్ని బుక్ చేసినట్లుగా మిర్రర్ మీడియా సంస్థ గతంలో పేర్కొంది. ఏమైనా.. దావూద్ ఆరోగ్యంపై వస్తున్న భిన్న కథనాలు అయోమయాన్ని మరింత పెంచేలా ఉన్నాయనటంలో సందేహం లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *