అప్పుడు వరంగల్‌లో.. ఇప్పుడు షాద్‌నగర్‌లో.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్..?

షాద్‌నగర్‌లో జరిగిన ‘దిశ’ ఘటన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.  ఈ సందర్భంగా వైఎస్ హయాంలో వరంగల్‌లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్‌ను అందరూ గుర్తుచేసుకుంటున్నారు. ఈ రెండు ఎన్‌కౌంటర్లు సజ్జనార్ నేతృత్వంలోనే జరగడంతో ఆయనపై ఇంటర్నెట్‌లో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉన్నారు. ఆ సమయంలో వరంగల్‌లో ఇద్దరి విద్యార్థినులపై యాసిడ్ దాడి జరిగింది.
ఈ ఘటనకు ఎస్ శ్రీనివాసరావు(25), పి. హరికృష్ణ(24), బి.సంజయ్(22) అనే ముగ్గురు యువకులను బాధ్యులుగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 48 గంటల్లోనే పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఎన్‌కౌంటర్ కూడా డిసెంబర్ నెలలోనే జరగడం గమనార్హం. నిందితులను ఘటనా స్థలికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులపై నిందితులు దాడి చేసేందుకు ప్రయత్నించారని, యాసిడ్ చల్లేందుకు ప్రయత్నించారని… అందువల్లే ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆ ముగ్గురిని కాల్చేశారని అప్పట్లో వరంగల్ ఎస్పీగా ఉన్న వీ.సీ.సజ్జనార్ వివరణ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం ఎన్‌కౌంటర్ చేశారు.
తాజాగా.. ‘దిశ’ ఘటనలో నిందితులను కూడా సైబరాబాద్ సీపీగా సజ్జనార్ ఉన్న సమయంలోనే ఎన్‌కౌంటర్ చేయడంతో ‘సజ్జనార్.. ది ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించారని, తమపై రాళ్లు రువ్వారని.. ఆయుధాలు లాక్కునేందుకు యత్నించారని పోలీసులు చెప్పారు. ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు మృతి చెందినట్లు చెప్పారు. దిశను కాల్చివేసిన ప్రాంతంలోనే నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగింది. తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు సమాచారం. పోలీస్‌ కస్టడీకి తీసుకున్న రెండో రోజే నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం గమనార్హం.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *