డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ లో….

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం ఉదయం 11.40 గంటలకు చేరుకున్నారు. అమెరికా సైనిక విమానం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌‌లో భార్య మెలనియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు కుర్దిష్ సహా ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందంతో కలిసి చేరుకున్న ట్రంప్‌నకు ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పలువురు కేంద్ర మంత్రుల ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ సహా అధికారులను ట్రంప్‌కు మోదీ పరిచయం చేశారు. శంఖాలు, సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో కళాకారులు స్వాగతం పలకగా, ట్రంప్ తన వాహనం వద్దకు చేరుకున్నారు అనంతరం అక్కడ నుంచి మోదీతో కలిసి శబర్మతి ఆశ్రమానికి ట్రంప్ బయలుదేరారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మోదీతో కలిసి కాన్వాయ్‌లో బయలుదేరిన ట్రంప్‌నకు దారి పొడువునా ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరి జాతీయ జెండాలు ఊపుతూ స్వాగతం పలిపారు. మధ్యాహ్నం 12.25 గంటలకు శబర్మతి ఆశ్రమానికి చేరుకున్న ట్రంప్, ప్రధాని మోదీ ట్రంప్ దంపతులకు ఖాదీ వస్త్రాలను కప్పి సాదరంగా ఆశ్రమంలోకి ఆహ్వానించారు. అక్కడ 20 నిమిషాలు గడిపారు. సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ ఉపయోగించిన వస్తువుల గురించి ప్రధాని వివరించారు. నూలు వడికే విధానం గురించి ఆశ్రమంలో మహిళలు తెలియజేయగా, ట్రంప్ దంపతులు దానిని ఆసక్తిగా పరిశీలించారు.. అనంతరం విజిటర్స్ బుక్‌లో ట్రంప్, మెలానియా సంతకాలు చేశారు. ఇది తనకు అద్భుతమైన పర్యటన అని, ఇందుకు నా మిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ట్రంప్ అందులో రాశారు. ఆశ్రమం ఆవరణలో పాలరాతితో తయారుచేసిన బొమ్మలను ఆసక్తిగా తిలకించారు. సబర్మతి ఆశ్రమంలో దాదాపు 20 నిమిషాలు పాటు ట్రంప్, మెలానియా కలియతిరిగి అక్కడ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. గాంధీజీ ప్రవచించిన చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అని తెలిపే బొమ్మలను మోదీ ట్రంప్ దంపతులకు బహూకరించారు. అక్కడ నుంచి గాంధీనగర్‌లో కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *