రివ్యూ: ద్వారక

పెళ్లిచూపులు సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ .. విభిన్నమైన మాటతీరుతో అలరించిన విజయ్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ద్వారక. పూజా జావేరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస రవీంద్ర దర్శకుడు. దొంగబాబాగా హీరో చేసే రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా భజరే నందగోపాల హరే అనే టీజర్‌తోనే క్రేజ్ సంపాదించుకుంది. టీజర్‌, ట్రైలర్‌తోనే క్రేజ్ సంపాదించుకున్న ద్వారక ప్రేక్షకులను అలరించిందా లేదా చూద్దాం.

కథ:

చిన్న చిన్న దొంగతనాలు చేస్తే ఎర్ర శ్రీను (విజయ్‌ దేవరకొండ) కాలం వెల్లదీస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ద్వారక అనే అపార్ట్‌మెంట్‌కు దొంగతానికి వెళ్తాడు. అనుకోని సంఘటనల్లో హీరో బాబాగా మారాల్సి వస్తుంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఆయనకో చిన్న సైజు గుడి కడతారు. పూజలు.. కానుకలు.. దీవెనలతో పాపులర్‌ అయిపోతాడు. మీడియా కూడా బాబాకి కావాల్సినంత పబ్లిసిటీ ఇస్తుంది. ఈ క్రమంలో హీరో ప్రేమించిన అమ్మాయికి పెళ్లి కాలేదంటూ ఆమె తల్లిదండ్రులు బాబాగా ఉన్న ఆయన వద్దకే తీసుకువస్తారు. ఇలా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఎర్ర శ్రీనుకి పెద్ద సమస్య వచ్చిపడుతుంది. దీంతో అంతా చిక్కుల్లో పడతారు..అసలు వీరికొచ్చిన సమస్య ఏంటీ..?దాని నుంచి ఎలా బయటపడ్డారు..?బాబా నాటకానికి ఎర్ర శ్రీను ఎలా తెరదించాడు అన్నదే కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్‌ పాయింట్స్ విజయ్‌ దేవరకొండ, కామెడీ, దొంగబాబా లీలలు. బాబాగా విజయ్ చేసే విన్యాసాలు.. మూఢ భక్తి.. మీడియా చేసే హంగామా.. వీటితో కూడిన సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. విజయ్ తనదైన నటనతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాడు. పెళ్లి చూపులుతో పోల్చుకుంటే విజయ్‌ తననటనలో మరింత మెచ్యూరిటీ కనబర్చాడు. సినిమా హుషారుగా సాగుతుంది. బాబా గుట్టురట్టు చేయడానికి వచ్చిన మురళీశర్మ ఎంట్రీతో కథ మరింతగా రక్తికడుతుంది. కథానాయకుడు దొరికిపోతాడా.. లేదా? అనే ఆసక్తిని ప్రేక్షకులకు కలిగించడంలో దర్శకుడు సఫలం అయ్యారు. పృథ్వీతో సహా కామెడీ గ్యాంగ్‌ అంతానవ్వులు పంచింది.. ఇతర నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ అక్కడక్కడా నెమ్మదించటం, కథలో కొత్తదనం లేకపోయినా.. ట్రీట్‌మెంట్‌తో సినిమాని ముందుకు నడిపించారు.ఇక సరైన ప్రతినాయకుడు లేకపోవడం మేజర్ మైనస్. ఫస్టాఫ్‌కు ముందు సినిమా కాస్త నెమ్మదిగా సాగడం … సెకండాఫ్‌లో కథగా చెప్పడానికి దర్శకుడి దగ్గర ఏమీ మిగలదు. అందుకే అక్కడ కూడా వినోదాన్ని నమ్ముకున్నారు. హీరో – విలన్‌ మధ్య ఘర్షణ సన్నివేశాలపై మరికాస్త దృష్టి సారిస్తే బాగుండేది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్‌గా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. సాయి కార్తీక్ అందించిన సంగీతం బాగుంది. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్స్ బాగున్నాయి. నిర్మాతల నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టాడు. విజువల్‌గా సినిమా రిచ్‌గా చూపించారు.

తీర్పు:

పెళ్లి చూపులు చిత్రం తర్వాత ద్వారకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. కామెడీ, విజయ్ దేవరకొండ,కథ సినిమాకు ప్లస్ కాగా అక్కడక్కడ నెమ్మదించిన కథనం, విలన్‌ లేకపోవడం సినిమాకు మైనస్. కథ పరంగా వైవిధ్యం లేకున్నా కథనంతో ఆకట్టుకునేలా ఉంది. హీరో హీరోయిన్‌ లవ్‌ట్రాక్‌..కామెడీతో కాలక్షేపానికి ఢోకాలేని విజయ్ దేవరకొండ ‘ద్వారక’ .

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *