ఈటెల చెప్పిన ఆదాయం లెక్క అదిరింది…

మొన్న మొన్నటి వరకూ నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం మీద తీవ్రంగా ప్రభావం చూపుతుందని చెప్పిన తెలంగాణ అధికారపక్షం టోన్ పూర్తిగా మారినట్లుంది. నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం మీద ప్రభావం పడుతుందని.. కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం ఉందంటూ చెప్పిన మాటల్లో నిజం పెద్దగా లేదన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాటలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయం గురించి విపక్షాలు సంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చే ప్రయత్నంలో ఈటెల తెలంగాణ ఆదాయం బ్రహ్మండంగా ఉందన్నట్లుగా గణాంకాలతో ఉదరగొట్టిన తీరు అందరి దృష్టిని ఆకర్షించేలా ఉందని చెప్పాలి. అదే సమయంలో ఈటెల చెప్పిన మాటల్లో నిజం ఎంతమాత్రం లేదని.. ఆయన లెక్కలన్నీ వాస్తవానికి దూరంగా ఉన్నాయంటూ.. గణాంకాల్ని ఏకరువు పెట్టిన జానా మాటలు విన్నప్పుడు.. సగటు జీవి బెదిరిపోవటం ఖాయం. తెలంగాణ రాష్ట్ర ఆదాయంపై ఈ ఇద్దరు నేతల వాదనను వింటే..

ప్రస్తుత ఏడాది రాష్ట్ర ఆదాయంలో గణనీయమైన వృద్ధిని సాధించామని.. భూములు అమ్మకాల విషయంలో తప్పించి.. అన్ని విషయాల్లోనూ సానుకూల వాతావరణం ఉందన్నట్లుగా ఈటెల మాటలు ఉన్నాయి. ఆరు నెలల వ్యవధిలో తెలంగాణరాష్ట్ర ఆదాయం రూ.47వేల కోట్ల మేర ఉందన్న ఆయన.. రానున్న రోజుల్లో వచ్చే జీఎస్టీ కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గేది లేదని.. మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.

గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది వ్యాట్ రూపేణ 22 శాతం.. వాహనాల పన్ను మీద 35 శాతం.. స్టాంపులు.. రిజిస్ట్రేషన్లపై 56 శాతం ఆదాయం పెరిగిందని చెప్పిన ఆయన.. మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 13 శాతం మేర ఆదాయంలో వృద్ధి ఉందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. పెద్దనోట్ల రద్దు కారణంగా రాష్ట్ర ఆదాయం మీద కాస్త ప్రభావం పడినప్పటికీ.. కేంద్రం జరిపే ఆర్థికసాయం రూపంలో భర్తీ చేసుకునే అవకాశం ఉందన్నారు.

2014-15లలో రాష్ట్రంలో మిగులు రూ.369 కోట్లు ఉండగా.. 2015-16లలో అధికారిక నివేదికల ప్రకారం రూ.3121 కోట్ల మిగులు ఉంటుందని చెప్పటం గమనార్హం. మార్చి నాటికి బడ్జెట్ వ్యయం లక్ష కోట్ల రూపాయిలు దాటుతుందన్న మాటను ఈటెల చెప్పగా.. ఈ లెక్కలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్ రూ.1.30లక్షల కోట్లు ఉండగా.. ఇప్పటివరకూ ఆరునెలల ఆదాయం రూ.47వేల కోట్లు మాత్రమే ఉందని చెబుతున్నారని.. రానున్న ఆరు నెలల్లో మరో రూ.47వేల కోట్ల ఆదాయం వస్తుందని అనుకున్నా.. ఆదాయం రూ.లక్ష కోట్లు దాటదు కదా? అన్న సూటి ప్రశ్న వేశారు.

పెద్దనోట్ల రద్దు కారణంగా ఆదాయం రూ.20వేల కోట్ల మేర తగ్గుతుందని ఆర్థికమంత్రే స్వయంగా చెబుతున్న వేళ.. రూ.96వేల కోట్ల ఆదాయానికి మరో రూ.10వేల కోట్ల మేర తక్కువ అయ్యే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ఆదాయం గురించి ఆర్థికమంత్రి చెబుతున్న మాటల్లో ఇసుమంత కూడా నిజం లేదన్న వాదనను జానా సమర్థంగా వినిపించిన భావన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. ఆదాయం సూపర్ గా ఉందంటూ ఈటెల చెప్పిన మాటలు అదరగొట్టేలా ఉంటే.. వాస్తవం ఎంత చేదుగా ఉందో తెలుసా అంటూ జానా చెప్పిన మాటలు జనాలు బెదిరేలా ఉన్నాయటంలో సందేహం లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *