దాదాకి ఇష్టం లేకపోయినా… అందుకే ఒప్పుకున్నాడట!

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేయడం సీఏసీ సభ్యుడు సౌరబ్ గంగూలీకి ఇష్టం లేదా? మిగతా సభ్యుల ఒత్తిడి మేరకు అయిష్టంగానే ఒప్పుకున్నాడా? అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. మంగళవారం రాత్రి రసవత్తర హైడ్రామా నడుమ కోచ్ ఎంపిక జరిగిన విషయం తెలిసిందే. వీరేంద్ర సెహ్వాగ్, రవిశాస్త్రిల మధ్య కోచ్ పదవికోసం తీవ్ర పోటీ నెలకొన్నట్టు సమాచారం. టీమిండియా మాజీ కెప్టెన్, క్రెకెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరబ్ గంగూలికి రవిశాస్త్రి ఎంపిక అస్సలు ఇష్టం లేదని చెబుతున్నారు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ గట్టిగా పట్టుబట్టడంతో రవిశాస్త్రికి మార్గం సుగమమైనట్టు సమాచారం. సీఏసీ సభ్యులైన సచిన్ టెండూల్కర్, సౌరబ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు మంగళవారం రాత్రి కెప్టెన్ విరాట్ కోహ్లీకి కాన్ఫరెన్స్ కాల్ చేసినప్పుడు అతడు శాస్త్రికే గట్టి మద్దతు తెలిపినట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కుంబ్లే రాజీనామా చేసిన తర్వాత రవిశాస్త్రినే టీమిండియా కోచ్‌గా ఎంపిక చేస్తే బాగుంటుందని కోహ్లీ బాహాటంగానే చెప్పిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే జట్టు ప్రయోజనాల కోసం రవిశాస్త్రిని ఎంపిక చేస్తే బాగుంటుందని సచిన్ టెండూల్కర్ గంగూలీకి నచ్చజెప్పినట్టు చెబుతున్నారు. మరోవైపు రవిశాస్త్రికి కూడా బౌలింగ్ కోచ్ విషయంలో బౌన్సర్ తగిలింది. బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ కావాలని రవిశాస్త్రి ప్రతిపాదించగా… గంగూలీ మాత్రం జహీర్ ఖాన్ పేరు తెరపైకి తెచ్చినట్టు సమాచారం. ‘‘జహీర్ ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా అంగీకరించిన తర్వాతే రవిశాస్త్రిని కోచ్‌గా ఎన్నుకునేందుకు గంగూలీ ఒప్పుకున్నాడు…’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అద్భుతమైన బౌలింగ్ ప్రతిభ ఉన్న జహీర్‌ఖాన్‌కు ఎవరూ అభ్యంతరం చెప్పే అవకాశం లేదని… అందుకే అతడికి సముచిత గౌరవం దక్కిందని పేర్కొన్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *