చైనా ఎల‌క్ట్రానిక్స్‌కు ఇండియా చెక్‌!

ఇండియాకు చీప్‌గా ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తి చేస్తూ.. ఇక్క‌డి మార్కెట్‌ను పూర్తిగా క‌బ్జా చేసేసిన చైనాకు చెక్ పెట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది. వీటి ద్వారా భ‌ద్ర‌తతోపాటు ఇత‌ర కీల‌క విష‌యాలు లీక‌వుతున్నాయ‌ని భావిస్తున్న కేంద్రం.. చైనా ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ ఉత్ప‌త్తుల దిగుమ‌తుల‌ను పునఃస‌మీక్షించాల‌ని నిర్ణ‌యించింది. డోక్లామ్‌లో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న స‌మ‌యంలో భార‌త్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. భార‌త్‌లో చైనా ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ ఉత్ప‌త్తుల విలువ 2200 కోట్ల డాల‌ర్లుగా ఉంద‌ని సీఐఐ వెల్ల‌డించింది. ఇంత భారీ మొత్తం చూసి ప్ర‌భుత్వం కూడా కంగుతిన్న‌ది. వీటివ‌ల్ల ఇక్క‌డి వ్య‌క్తులు, వ్యాపారాలు, ప్ర‌భుత్వ విభాగాల కీల‌క స‌మాచారం చైనాకు లీక్ అవుతున్న‌ద‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది. కీల‌క స‌మాచారం ర‌క్ష‌ణ కోసం అన్ని వ్యాపార సంస్థ‌లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.

ఈ మ‌ధ్యే కేంద్ర ఐటీ శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ఓ అత్యున్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించి.. భార‌త ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ రంగాల్లో చైనా ఉత్ప‌త్తుల‌పై ఆరా తీశారు. భార‌త్‌లోని ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ రంగం చైనీస్ కంపెనీల‌పై ఆధార‌ప‌డింది. వీటిలో మొబైల్ ఫోన్స్‌, మందులు, టెలికాం నెట్‌వ‌ర్క్‌, డివైస్‌లు, సెన్స‌ర్లు ఉన్నాయి. భార‌త ఆన్‌లైన్ మార్కెట్ల‌లోనూ చైనా కంపెనీలు ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇందులో చాలావ‌ర‌కు డివైస్‌లు స‌మాచారాన్ని చైనా స‌ర్వ‌ర్ల‌లో నిక్షిప్తం చేస్తున్నాయి. ఈ డివైస్‌ల నుంచి ఆన్‌లైన్ ట్రాన్స‌క్ష‌న్స్ చేసిన స‌మ‌యంలోనూ కీల‌క స‌మాచారం చైనా స‌ర్వ‌ర్ల‌కు చేరిపోతున్న‌ది. ఇది భ‌ద్ర‌తా స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. ముఖ్యంగా రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న స‌మ‌యంలో ఇది మంచిది కాదు అని ప్ర‌భుత్వంలోని సీనియ‌ర్ అధికారి వెల్ల‌డించారు. ఇక చైనాతో పెద్ద ఎత్తున ఉన్న వాణిజ్య లోటు కూడా ప్ర‌భుత్వాన్ని ఈ దిశ‌గా ఆలోచించేలా చేస్తున్న‌ది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *