తెలంగాణా మరో ముందడుగు

దేశంలో అన్ని ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ పౌరవిమాన సేవలు ప్రారంభించి, సామాన్యులకు కూడా వాటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ప్రాంతీయ విమానయాన అనుసంధాన పథకాన్ని గత అక్టోబర్ నెలలో ప్రవేశపెట్టింది. ఆ పధకంలో తెలంగాణా ప్రభుత్వం కూడా చేరింది. రాష్ట్రంలో ప్రజలకి, విమానయాన సంస్థలకి కూడా అనుకూలంగా ఉండే ముఖ్యమైన ప్రాంతాలలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర విమానయాన సంస్థ, ఎయిర్ పోర్ట్స్ అధారిటీతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం డిల్లీలో ఒక ఒప్పందం కుదుర్చుకొంది. ఈ కార్యక్రమానికి మంత్రి కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతి రాజు, రాష్ట్ర మంత్రి కేటిఆర్ తదితరులు హాజరయ్యారు. వారి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఎయిర్ పోర్ట్స్  అధారిటీ చైర్మన్ గురుప్రసాద్ మహాపాత్ర, కేంద్ర పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పధీ ఎం.ఒ.యూ.పై సంతకాలు చేశారు.

రాష్ట్రంలో ఏఏ ప్రాంతాలలో కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటు చేయడానికి సాంకేతికంగా, ఆర్ధికంగా అనువుగా ఉన్నాయనే విషయంపై ఎయిర్ పోర్ట్స్ అధారిటీ నియమించబోయే నిపుణుల కమిటీ అధ్యయనం చేసి నివేదికను ఇస్తుంది. అలాగే ఈ విమానాశ్రయాల నుంచి ఎక్కువగా ప్రైవేట్ విమానయాన సంస్థలే విమానాలు నడిపించే అవకాశం ఉంటుంది కనుక ఆ సంస్థలతో కూడా చర్చించి వాటికి లాభదాయకంగా ఉండే ప్రాంతాలు, రూట్స్ మొదలైన వివరాలను కూడా సేకరిస్తారు. ఆ నివేదికను బట్టి రాష్ట్రంలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తారు. వాటి ఏర్పాటు చేయడానికి కనీసం రెండు మూడేళ్ళు పట్టవచ్చు కానీ ఆ దిశలో ఇప్పటికైనా మొదటి అడుగు పడినందుకు సంతోషించవలసిందే.

రాష్ట్రంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే అందుబాటులో ఉంది. దానిని ప్రారంభించిన తరువాత బేగం పేట విమానాశ్రయానికి పౌరవిమాన సర్వీసులు నిలిపి వేశారు. వరంగల్లో ఉన్న విమానాశ్రయం మూతబడి చాలా కాలమే అయ్యింది. కరీంనగర్ జిల్లాలో బసంత్ నగర్ వద్ద గల కేశోరాం సిమెంట్ కంపెనీ వద్ద కూడా ఒక చిన్న విమానాశ్రయం ఉంది. ఒకప్పుడు ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్ లైన్స్ సంస్థలకు చెందిన వాయుదూత్ విమానాలు అక్కడి నుంచి సేవలు అందిస్తుండేవి. కానీ అప్పటికి విమానప్రయాణం చాలా ఖరీదైన వ్యవహారం కావడంతో సామాన్య ప్రజలు వాటికి దూరంగా ఉండేవారు. ఆ కారణంగా ఆ విమానాశ్రయం మూతపడింది. కనుక రాష్ట్రంలో ప్రజలు ఎక్కడికి వెళ్ళాలన్నా తప్పనిసరిగా హైదరాబాద్ వచ్చి శంషాబాద్‌ నుంచే వెళ్ళవలసి వస్తోంది. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటైనట్లయితే నేరుగా అక్కడి నుంచే ప్రయాణించవచ్చు. ఈ పధకం అమలయితే అటువంటి విమానాశ్రయాలు కూడా మళ్ళీ తెరుచుకొనే అవకాశం ఉంటుంది.

దేశంలో నానాటికీ పెరుగుతున్న పౌర విమానయాన రంగంలో సాంకేతిక నిపుణుల కొరత చాలా ఉంది. దానిని దృష్టిలో ఉంచుకొని ఆ రంగంలో ఒక శిక్షణా అకాడమీ స్థాపించడానికి బేగంపేట విమానాశ్రయంలో ఉన్న 4 హ్యాంగర్లను రాష్ట్ర ప్రభుత్వానికి లీజుగా ఇవ్వమని మంత్రి కేటిఆర్ కోరారు. ఆయన అభ్యర్ధనకు అశోక్ గజపతి రాజు సానుకూలంగా స్పందిస్తూ అది చాలా మంచి ఆలోచన అని మెచ్చుకొన్నారు. త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి దానిపై నిర్ణయం తీసుకొని తెలియజేస్తామని చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *