పెద్ద నోట్ల రద్దుతో నేతల్లో ఒకటే టెన్షన్…ఆ మంత్రి బీ కూల్‌గా ఉన్నారట

ట్రబుల్ షూట‌ర్ హ‌రీశ్‌ రావు మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఈ మాస్ లీడ‌ర్ చేస్తున్న పనికి సిద్ధిపేట ప్రజలతో పాటు పార్టీ వ‌ర్గాలు ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తుతున్నాయి. చాలా మంది నేతలు ప్రజల మధ్యకు రావడానికి ఇబ్బంది పడుతుంటే హ‌రీశ్‌ మాత్రం త‌న రూటే స‌ప‌రేటంటూ త‌న మార్క్ చూపించుకున్నారు. ఇంత‌కీ హ‌రీశ్‌ ఏం చేశారు? వార్తల్లో వ్యక్తిగా హరీశ్ ఇప్పుడెందుకు మారారు? వాచ్ దిస్ స్టోరీ.

ఇప్పుడు దేశమంతటా కరెన్సీ కలకలం.. పెద్దనోట్ల రద్దుతో అవస్తలు పడుతున్న జనం… చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడిపోతున్నారు. డబ్బుల కోసం పనులు మానుకుని మరీ బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు..చాంతాడంత క్యూలైన్‌లో నిలుచుని పాత నోట్లను డిపాజిట్‌ చేసుకుంటున్నారు. కిలోమీటర్లకు కిలోమీటర్లు ఉన్న లైన్‌లో ఉండి ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో పేద వర్గాలు ప్రస్తుతానికి ఇబ్బందులు పడుతున్నాయి. నిత్యావసరవస్తువులు కొనుక్కొనేందుకు చేతిలో వందల నోట్లు లేక…పాత నోట్లు చెల్లక సతమతమవుతున్నారు.. అయిదారు రోజులుగా సామాన్యులే బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు.. పెద్దలెవరూ ఆ ఛాయలకే రావడం లేదు..

అయితే బ్యాంకుల దగ్గర ఆపసోపాలు పడుతున్న జనాన్ని పలకరించే నేతలే కరువయ్యారు. చాలా మంది నేతలు బ్యాక్‌మనీని వైట్‌ చేసుకునే పనిలో ఉన్నారంతా! అందరూ కాదు కానీ… రాజకీయ నాయకుల్లో ఎక్కువ మంది ఇదే పనిలో ఉన్నారనిపిస్తోంది… గుట్టలు గుట్టలుగా పేరకుపోయిన నోట్ల కట్టలను ఎలా కాపాడుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. చెప్పాపెట్టకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్న మోదీని కాసేపు తిట్టుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణమొక యుగంలా గడుపుతున్నారు. ఎవరి పనులు వాళ్లు చక్కబెట్టుకునేందుకే సమయం సరిపోవడం లేదాయె! ఒక సామాన్య ప్రజల కష్టాలను మాత్రం ఎలా పట్టించుకుంటారు?

సమస్య ఏదైనా …ఎవరికొచ్చినా టక్కుమని వాలిపోయే హరీశ్‌రావు ఇప్పుడు మళ్లీ తన మార్కును చూపించారు.. అసలే ఆకలి మంట మీద ఉన్న జనం చెంతకు వెళ్లడానికి నేతలు జంకుతున్న తరుణంలో హరీశ్‌ పెద్ద సాహసమే చేస్తున్నారు.. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలంతా గంటల తరబడి క్యూలో ఉండి తమ దగ్గర ఉన్న పాత నోట్లను డిపాజిట్‌ చేసుకుంటున్నారు.. కొత్త నోట్లు తీసుకుని నిత్యావసరాలు కొనుక్కుంటున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల దగ్గర ఇబ్బందులు పడుతున్న ప్రజలను హరీశ్‌ పలకరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై జనం ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. పేదల గోడును ఆలకించారు.. వారి కష్టాలను దగ్గరుండి చూశారు. అవ్వా ఎన్ని గంట‌ల‌కు వ‌చ్చిన‌వ్. ..? ఎన్ని పైస‌లు ఇస్తుండ్రు బ్యాంకోల్లు…? గా నాలుగు వేలే సాలతయా..? అంటూ వాళ్ల భాష‌లో మాట క‌లిపారు. మిగ‌తా వారంద‌రితోనూ ఇదే వ‌రుస‌.

అంత‌టితో ఈ మాస్ లీడ‌ర్ ఊరుకోలేదు. అక్కడే ఆగి బ్యాంక్ మేనేజ‌ర్‌తో మాట్లాడారు. తాగ‌డానికి మంచినీళ్లు… ఎండ తగలకుండా ఉండేందుకు టెంట్లు వేయాల‌ని ఆదేశించారు. ఇంకాస్త ముందుకు వెళ్తుంటే గంట‌ల త‌ర‌బ‌డి క్యూ లైన్‌లో నిలుచున్న ప్రజలు ఆయ‌న దగ్గరకు వ‌చ్చారు. హ‌రీశ్‌ ద‌గ్గర వాళ్ల గోడును వెళ్లబోసుకున్నారు. అంద‌రి సమస్యలు చాలా ఓపిగ్గా విన్న హ‌రీశ్‌ రావు వారికి ప‌లు చూచ‌న‌లు చేశారు. ఆప్యాయంగా ప‌లక‌రిస్తూ ఓపిగ్గా స‌మాధానాలు చెప్పారు. న‌వ్వుకుంటూ వారి భుజాల మీద చేతులు వేసుకుంటూ ముందుకు న‌డుస్తూ వెన‌క్కి తిరిగుతూ ఇలా ఒక‌టేమిటి క్యూలైన్లో ఉన్న వారంద‌రి ఇబ్బందులను విన్నారు. సిద్ధిపేటలో ఓ బ్యాంక్ దగ్గర మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉండడాన్ని గమనించిన హరీశ్ అక్కడ పెళ్లి పత్రికతో ఆందోళన చెందుతున్న ఎన్సాన్ పల్లికి చెందిన బాలవ్వను సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆమె సమస్య ఏమిటంటే.. కొడుకు పెళ్లి… చేతిలో పాత వెయ్యి…అయిదు వందల నోట్లే ఉన్నాయి… ఆ నోట్లను కిరాణా షాపు అతను తీసుకోవడం లేదు… ఆ పాత నోట్లను బ్యాంకులో మార్చుకునేందుకు వచ్చిందా పెద్దావిడ! తన సమస్యను హరీశ్‌తో చెప్పుకుని కన్నీళ్ల పర్యమంతమయ్యింది. దీంతో అక్కడే ఉన్న ఓ షాపులోంచి అరువు మీద ఆమెకు అవసరమైన సామానంతా ఇప్పించారు.. కొత్త నోట్లు వచ్చాక డబ్బు చెల్లించమని చెప్పారు.. దీంతో బాలవ్వ మురిసిపోయింది..

తెలంగాణలో ఇప్పుడు హరీశ్ హాట్‌టాపిక్‌ అయ్యారు.. ఆయన ఓర్పు చూసి పార్టీ వర్గాలే ఆశ్చర్యానికి లోనవుతున్నాయి.. ఏ టెన్షన్‌ లేకుండా ఆయన ఎలా ఉండగలుగుతున్నారని ముచ్చటించుకుంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో నియోజకవర్గాలకు వెళితేనే జనం కొట్టేట్టు ఉన్నారని.. ఇలాంటి పరిస్థితులలో హరీశ్‌ ధైర్యంగా జనంలోకి వెళ్లడమే కాకుండా…వారితో మమేకమవ్వడం నిజంగా వండరే అని అనుకుంటున్నారు. హైదరాబాద్‌ నుంచి ఎక్కడికి వెళ్లినా మధ్యలో సిద్ధిపేటలో కాసేపు ఆగి ప్రజలతో ముచ్చటించి వెళ్లడం హరీశ్‌కు అలవాటు. ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడటంతో అది మరింత ఎక్కువయ్యింది.. కార్యక్రమం ముగిసి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లేటప్పుడు కూడా సిద్ధిపేటలో ఆగుతారు. పనులేమైనా ఉంటే చూసుకుని వెళతారు..పని లేకుండా పని కల్పించుకుని మరీ సిద్ధిపేటలో ఆగుతారు. ప్రజలు ఎక్కడ కనిపించినా ఆగి పలకరించడం ఆయనకు అలవాటు. తాజా సిద్ధిపేట సంఘటన కూడా ఇంతే! సోష‌ల్ మీడియాను ఎక్కువ‌గా ఫాలో అయ్యే హ‌రీశ్‌.. నోట్ల ర‌ద్దుపై వ‌చ్చిన జోకుల‌ను మ‌హిళ‌ల వ‌ద్ద ప్రస్తావించారు. స‌ర‌దాగా వారిపై జోకులేశారు. ఓ ముస‌లావిడ ద‌గ్గరకు వెళ్లి అవ్వా ఎన్ని నోట్లు తెచ్చిన‌వ్.. ? ముస‌లాయ‌న‌కు తెలుసా.. ? తెల్వకుండా పోపుల డ‌బ్బాలో దాచిన పైసలా ? అంటూ హాస్యమాడారు. హ‌రీశ్‌ బుగ్గల‌ను గిల్లి మ‌రీ ఆ ముస‌లావిడ న‌వ్వింది. హ‌రీశ్‌ చ‌మ‌త్కారంతో అక్కడున్న మ‌హిళ‌లంద‌రూ ఒక్కసారిగా న‌వ్వారు.

పెద్ద నోట్ల రద్దుతో రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయమై తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ఈ సందర్భంగా హరీశ్‌ అన్నారు. నోట్ల మార్పిడివల్ల రైతులు అనేక కష్టాలు పడుతున్నారని, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి ఈ సంగతి తెలియచేస్తామన్నారు.బ్యాంకుల నుంచి నగదు తీసుకోవడంలో పరిమితి పెంచాలని కేంద్రాన్ని కోరతామన్నారు. నోట్ల రద్దు వల్ల వచ్చిన సమస్యలు, వాటిపై వస్తున్న డిమాండ్లు వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తరపున లేఖ రాస్తామని ఆయన చెప్పారు. హరీశ్‌ చొరవ చూసి…ఎంతైనా హరీశ్‌ హరీశేనంటున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు…

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *