జగన్ కు అన్యాయమే జరుగుతోందంటున్న: హరీశ్!

ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత హోదాలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా… ఆయన వాదన పూర్తి కాకుండానే మైక్ కట్ అయిపోతోంది. ఈ తరహా మైక్ కట్లు ఈ మధ్య మరింతగా పెరిగాయన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే విపక్షంలో ఒక్క జగనే ఉన్నారా? ఆయన తన పార్టీ సభ్యులకు కూడా మాట్లాడే అవకాశమివ్వాలి కదా అంటూ అధికార పక్షం టీడీపీ తనదైన వితండ వాదన చేస్తోంది. విపక్షం తరఫున ఎవరు మాట్లాడాలో కూడా అధికార పక్షమే ఎలా నిర్ణయిస్తుందన్నది ఇక్క ఆన్సర్ లేని ప్రశ్నగానే మిగులుతోంది. మొన్నటిదాకా హైదరాబాదులోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన ఏపీ సర్కారు… ఇటీవలే తన అసెంబ్లీ సమాశాలను వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ భవన సముదాయానికి మార్చేసింది.

ఈ క్రమంలో అసెంబ్లీ లోపలే కాకుండా అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద కూడా వైసీపీకి మాట్లాడే సమయం చిక్కడం లేదు. నిన్న నేడు అక్కడి మీడియా పాయింట్ వద్ద చోటుచేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనమని చెప్పక తప్పదు. మొత్తానికి ఏపీ అసెంబ్లీలో విపక్షం గొంతు నొక్కేయబడుతోందన్న వాదన సర్వత్ర వినిపిస్తోంది. ఈ వాదన ఏపీలోనే కాదండోయ్… పొరుగు రాష్ట్రంలో తెలంగాణలోనూ కూడా వినిపిస్తోంది. జగన్ నోరు నొక్కేస్తున్నారన్న వాదన తెలంగాణలో ఎక్కడ వినబడిందో తెలుసా? ఇంకెక్కడ ఆ రాష్ట్ర చట్టాల రూపకల్పన కోసం ఏర్పాటైన తెలంగాణ అసెంబ్లీలో. ఇక జగన్కు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పిన నేత ఎవరో తెలిస్తే… మరింత ఆశ్చర్యానికి గురవుతాం.

ఇక అసలు విషయంలోకి వస్తే… తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కాసేపటి క్రితం తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంగా… జగన్ కు జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు తమకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదని బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ఆరోపించగా సీఎల్పీ నేత జానారెడ్డి కూడా ఆయన వాదన నిజమేనని కేసీఆర్ సర్కారుపై దండెత్తారు. దీంతో విపక్ష వాదనకు సమాధానం ఇచ్చేందుకు లేచిన హరీశ్ రావు… వైఎస్ జగన్ అంశాన్ని ప్రస్తావించారు.

ఒకసారి పక్క అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూడాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మైకును ఎన్నిసార్లు కట్ చేస్తున్నారో చూడాలని సూచించారు. అక్కడి టీడీపీ ప్రభుత్వంతో పోల్చితే తెలంగాణ సభలో మాట్లాడేందుకు విపక్షాలకు తామే ఎక్కువ అవకాశమిస్తున్నామని హరీశ్ ఈ సూచన ద్వారా పరోక్షంగా చెప్పుకొచ్చారు. మరి హరీశ్ మాటలు అక్కడి టీడీపీ సర్కారుకు స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ఎప్పుడు వినిపిస్తాయో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *