హీరో రాజశేఖర్ కార్ యాక్సిడెంట్
హీరో రాజశేఖర్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. నిన్న రాత్రి షూటింగ్ ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయం నుంచి బంజారాహిల్స్‌లోని ఇంటికి వాహనంలో బయలుదేరారు. ఆయన స్వయంగా డ్రైవ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టారు.రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ ప్రెస్ వే ముందు నుంచి వెళుతున్న రామిరెడ్డి అనే వ్యక్తి కారును నటుడు రాజశేఖర్ కారు ఢీ కొట్టింది. దీంతో.. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తప్పు మీదంటే మీదన్నట్లుగా వాదులాడుకున్నట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా తాగి వాహనం నడుపుతున్నట్లుగా నటుడు రాజశేఖర్ పై రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. తన తల్లి చనిపోయిన డిప్రెషన్ లో కారు నడపటం వల్లే ప్రమాదం జరిగిందే తప్పించి తాను మద్యాన్ని సేవించలేదన్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. బ్రీత్ ఎనలైజర్ ద్వారా నటుడు రాజశేఖర్ ను పరీక్షించారు. రాజశేఖర్ మద్యం సేవించలేదని తేలింది. ఈ నేపథ్యంలో నటుడు రాజశేఖర్ పై కేసు పెట్టిన రామిరెడ్డి తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు చెబుతున్నారు.