ఎన్టీఆర్ బ‌యోపిక్ వెనుక ఎవ‌రున్నారు?

నంద‌మూరి బాల‌కృష్ణ – రాంగోపాల్ వ‌ర్మ‌.. అబ్బ ఏం కాంబినేష‌న్ అండీ. ఇలా వీరిద్ద‌రి సినిమా గురించిన వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిందో, లేదో… అలా చిత్ర‌సీమ అవాక్క‌యిపోయింది. ఇద్ద‌రికీ ఎలా కుదిరింద‌బ్బా..?? అంటూ తెగ చ‌ర్చించేసుకొంటున్నారు. ‘ఈ సినిమా అవ్వ‌దూ.. ఏడ్వ‌దు.. కేవ‌లం పేరుకి మాత్ర‌మే’ అని లైట్‌గా తీసుకొన్న‌వాళ్లూ ఉన్నారు. అదీ నిజ‌మే మ‌రి. ఇలాంటి క‌బుర్లు రాంగోపాల్ వ‌ర్మ ఇది వ‌ర‌కు ఎన్ని చెప్ప‌లేదూ..?! కాక‌పోతే ఇది ఎన్టీఆర్ బ‌యెపిక్ ఆయె. దానికి తోడు బాల‌కృష్ణ హీరో! దాంతో కాస్త సీరియెస్‌గా దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌నిపిస్తోంది. అయితే ఇదేదో అప్ప‌టిక‌ప్పుడు పుట్టుకొచ్చిన కాంబినేష‌న్ కాదు.

మూడు నెల‌ల నుంచి బ్యాక్ గ్రౌండ్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ట‌. బాల‌య్య – వ‌ర్మ‌లు త‌ర‌చూ క‌లుస్తున్నార‌ని, ప్ర‌తీ రోజూ ఎంతో కొంత స‌మ‌యం ఈ స‌బ్జెక్ట్ గురించి చ‌ర్చిస్తున్నార‌ని తెలుస్తోంది. నిజానికి బాల‌య్య ద‌గ్గ‌ర ఎన్టీఆర్ స్ట్రిప్టు ఎప్పుడో ఉంది. ముర‌ళీ మోహ‌న్ అల్లుడు విష్ణు ఇందూరికి ఎప్ప‌టి నుంచో.. సినిమాల‌వైపు రావాల‌ని తెగ ఆశ. ఎన్టీఆర్ క‌థ‌ని వెండి తెర‌పై చూపించాల‌ని క‌ల‌. అందుకోసం ఎన్నాళ్ల నుంచో ఎన్టీఆర్ చ‌రిత్ర‌ని క్షుణ్ణంగా ప‌రిశోధ‌న చేసి, ఆయ‌న క‌థ‌లోని రోమాంచిత ఘ‌ట్టాలన్నీ పేర్చి ఓ క‌థ‌గా రాసుకొన్నాడ‌ట‌. ద‌ర్శ‌కుడు దేవాక‌ట్టా కూడా ఇందులో సాయ ప‌డ్డార్ట‌. బాల‌య్య‌తో, దేవాక‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందించాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయితే దేవాక‌ట్టా ద‌ర్శ‌కుడైతే… ఈ సినిమాకి రావ‌ల్సినంత ఫోక‌స్‌రాదేమో అని.. ఆయ‌న పేరు ప‌క్క‌న పెట్టేశారు.

ఈ సినిమాని తానే డైరెక్ట్ చేయాల‌ని బాల‌య్య కూడా కొన్నాళ్లు సీరియెస్‌గా ఆలోచించాడు. స‌న్నిహితులు కూడా బ‌ల‌వంతం చేసిన‌ట్టు వినికిడి. అయితే… ద‌ర్శ‌క‌త్వం చేసే విష‌యంలో బాల‌య్య బాగా జంకాడ‌ని, అనుభ‌వ‌జ్ఞుడి చేతిలో ఈ సినిమా పెట్టాల‌ని ఫిక్స‌య్యాడ‌ని, అటూ ఇటూ తిరిగి ఈ సినిమా.. వ‌ర్మ చేతికి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు సెట్ అవ్వ‌డం వెనుక వ‌ర్మ శిష్యుడు పూరి జ‌గ‌న్నాథ్ హ్యాండ్ కూడా ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం బాల‌య్య – పూరి క‌ల‌సి పైసా వ‌సూల్ తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ సెట్లోనే.. బాల‌య్య – వ‌ర్మ‌ల మ‌ధ్య భేటీ జ‌రిగేద‌ట‌. మొత్తానికి ఎన్టీఆర్ బ‌యోపిక్ వెనుక పెద్ద త‌తంగ‌మే న‌డిచింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పేరు, నిర్మాత‌, ఇత‌ర వివ‌రాల్ని ప్ర‌క‌టించ‌డానికి వ‌ర్మ సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈసారి ఇంకెన్ని సంచ‌ల‌నాలు బ‌య‌ట‌కు వ‌స్తాయో…??

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *